Pillalamarri: ప్రపంచంలో రెండో అతిపెద్ద మహావృక్షం పిల్లలమర్రి రా..రమ్మని పిలుస్తోంది..

www.mannamweb.com


Pillalamarri: ప్రపంచంలో రెండో అతిపెద్ద మహావృక్షం పిల్లలమర్రి రా..రమ్మని పిలుస్తోంది..

మహబూబ్‌నగర్​ జిల్లా అనగానే గుర్తుకొచ్చేది పిల్లలమర్రి మహావృక్షం. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చెట్టు..ఉమ్మడి జిల్లాకే తలమానికం. సరైన సంరక్షణ లేక ఈ మహావృక్షం…నాలుగేళ్ల క్రితం ఓశాఖ నేలకొరిగింది. కానీ..తన చరిత్ర ముగియలేదని…పాలమూరు పిల్లలమర్రి పునర్వైభవానికి సిద్ధమైంది. రారామ్మని సందర్శకులకు పిలుస్తోంది. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు కనువిందు చేసింది. అయితే పునరుజ్జీవంతో ఇక నుంచి పర్యాటకులకు చేరువ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సందర్శకుల కోసం పిల్లలమర్రి గేట్లు తెరవబోతున్నారు.

నాలుగేళ్ల క్రితం తెగులు, చెదలతో పాలమూరు ప్రతీక పిల్లలమర్రికి గడ్డు పరిస్థితి ఎదురయ్యింది. ఓవైపు సరైన నిర్వాహణ లేక ఎండిపోవడం..మరోవైపు చెదల పట్టడంతో మహావృక్షం కొమ్మలు బాగా దెబ్బతిన్నాయి. ఊడలు ఊడిపోవడం, ఆకులు ఎండిపోవడంతో పచ్చని పందిరి వేసినట్లు ఉండాల్సిన పిల్లల మర్రి కళ తప్పింది.

ఒకానోక సందర్భంలో ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందారు. పరిస్థితిని గమనించిన నాటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పిల్లలమర్రి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీశాఖ అధికారుల స్పందించి సంరక్షణ చర్యలు చేపట్టారు. అధునాతన పద్ధతిలో చెట్టును కాపాడే ప్రయత్నం చేశారు. భారీ మర్రిచెట్టు ఊడలకు చెదలు పట్టడంతో అధికారులు సెలైన్ బాటిళ్లలో క్లోరోపెరిపాస్ ద్రావాణాన్ని నింపి చికిత్స అందించారు. పాదుల దగ్గర మట్టిలో జీవం పోయి చెదలు పట్టడంతో… బలమైన సేంద్రీయాలతో కూడిన మట్టిని నింపారు.

మర్రిచెట్టుకు బలమైన ఊడలకు ఎలాంటి సమస్య రాకుండా పీవీసీ పైపులను అమర్చి నేరుగా భూమికి చేరేలా ఏర్పాట్లు చేశారు. వాటి ద్వారానే క్లోరోపైరిపాస్ లిక్విడ్ ను అందించారు. ఎట్టకేలకు ఊడలు భూమిని తాకడం, దాని ద్వారా చెట్టు బలంగా నిలబడింది. ఫారెస్ట్ అధికారుల చోరవతో పిల్లలమర్రికి మళ్లీ జీవం వచ్చింది. ఊడలు బాగా పెరిగి నేలలోకి చొచ్చుకెళ్లాయి. చెదలు పట్టిన కొమ్మలు మళ్లీ ధృడంగా తయారయ్యాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ భారీ వృక్షం మళ్లీ దర్జాగా నిలబడింది. నిండా కొత్త కొమ్మలు, ఆకులతో కళకళలాడుతోంది. ఆకుపచ్చని పందిరి వేసి సంపూర్ణ ఆరోగ్యంగా తన మనుగడ ఇంకా ఉందంటూ నిరూపించింది పిల్లలమర్రి.

చెట్టును సంరక్షించే ప్రక్రియ సుధీర్ఘంగా కొనసాగడంతో దాదాపుగా నాలుగేళ్ల నుంచి సందర్శకులను సమీప ప్రాంతాలకు అనుమతించలేదు. కేవలం దూరం నుంచి మాత్రమే చెట్టును చూసి వెళ్లే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వాచ్ స్టాండ్ ను ఏర్పాటు చేసి చెట్టును తాకకుండా సదర్శనకు అవకాశం కల్పించారు. అయితే మహా వృక్షాన్ని దగ్గరి నుంచి చూసే అవకాశం లేకపోవడంతో పర్యాటకులు అసంతృప్తిగా తిరిగి వెళ్లేవారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ఫారెస్ట్ అధికారుల తాజా ప్రకటనతో సంతోషంలో మునిగిపోతున్నారు.

పర్యాటకుల కోరిక మేరకు త్వరలోనే పిల్లలమర్రి గేట్లు తెరుచుకోనున్నాయి. మహావృక్షాన్ని తాకకుండా కేవలం చూస్తూ ఆ నీడలో నడుస్తూ వెళ్లేలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకుల కోసం మౌలికవసతులను అభివృద్ధి చేశారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంటు, పర్యాటకులు సేదతీరేలా ఆకర్షణీయమైన బెంచీలు అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా పిల్లల కోసం సరికొత్తగా పార్కును, వాల్ పెయింటింగ్స్ సిద్ధం చేశారు.

అటవీశాక అధికారుల సంరక్షణ చర్యలు సత్ఫలితాలివ్వడంతో పాలమూరు ఐకానిక్ పిల్లలమర్రి మళ్ల జీవం పోసుకుంది. త్వరలోనే పర్యాటకులను అలరించేందుకు చేరువకానుంది.