krishnas lunch box తక్కువ ధరకే మూడు పూటల రుచికరమైన భోజనం.. గొప్ప మనసు చాటుకుంటున్న అమ్మ..!

Andhra Pradesh: తక్కువ ధరకే మూడు పూటల రుచికరమైన భోజనం.. గొప్ప మనసు చాటుకుంటున్న అమ్మ..!


అభివృద్ది చెందుతున్న పట్టణ, నగరాల్లో ఒంటరిగా ఉండే వృద్దుల సంఖ్య పెరిగిపోతుంది. పిల్లలు ఉద్యోగ రీత్యా, విద్య కోసం ఇతర నగరాలు, దేశాల బాట పట్టడంతో వారి తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. మలి సంధ్యలో సరైన ఆహారం, సాయం అందించే వారు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇటువంటి వారి కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చింది ఓ అమ్మ.. మూడు పూటలా కడుపు నిండా భోజనం పెట్టి తీర్చుతోంది గుంటూరు జిల్లాకు చెందిన వృద్దురాలు.

కృష్ణాస్ లంచ్ బాక్స్.. ఇదేదో కమర్షియల్ సంస్థ అనుకోకండి.. ఒంటరిగా ఉండే వృద్దుల ఆకలి తీర్చేందుకు అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందించే సంస్థ ఇది. తెనాలి చెంచుపేటకు చెందిన లక్ష్మీ తన ఇంటిలో అతి సాధారణంగా ఈ మెస్ నిర్వహిస్తోంది. 2002లో ఒక వృద్దుడు కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. దీంతో రెండు పూటలా ఆహారం పంపించే వారు ఎవరైనా ఉండే చూడాలంటూ లక్ష్మీని అడిగాడు. దీంతో ఆమె ఎవరో ఎందుకు తానే ఆ పనిచేస్తే బాగుంటుందని అనిపించింది. వెంటనే రెండు వారాల పాటు అతనికి రెండు పూటలా ఆహారం పంపింది. అంతే అప్పటి నుండి ఆమెకు ఎవరో ఒకరు ఫోన్ చేసి ఆహారాన్ని పంపాలని అడగటం మొదలు పెట్టారు.

అప్పటి నుండి ఇప్పటి వరకూ తన ఇంటి నుండే 125 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇందులో గొప్పేముంది అనుకోకండి. కేవలం వంద రూపాయలకే మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఒక్క పూట మెస్ లో భోజనం చేయాలంటేనే వంద రూపాయలకు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో కేవలం వంద రూపాయలకే రెండు పూటలా భోజనం ఉదయం పూట ఆల్పాహారం అందించడమంటే మాటలు కాదు. అది కూడా ఇంటింటికి వెళ్లి ఆహారాన్ని అందిస్తారు. లక్ష్మీ కుమారుడు పవన్ కుమార్ అతని భార్య శ్రీలేఖ ఆమెకు సహకారం అందిస్తున్నారు. ఆమె ఉంటున్న ఇంటిలో ఆహారాన్ని తయారు చేస్తారు. ఆమెనే స్వయంగా అందరి క్యారేజ్ లో ఆహార పదార్థాలను సర్ధుతారు. వాటిని డెలివరీ బాయ్స్ తీసుకెళ్లి అవసరమైన వారికి అందిస్తుంటారు. లక్ష్మీ మెస్ ద్వారా పదిహేను మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.

వంద రూపాయలకే మూడు పూటలా ఆహారం అంటే ఏదో ఒకటి పెడతారులే అనుకోవద్దు. ఉదయం పూట ఆల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం ఐదు కూరలతో పాటు అన్నం పంపిస్తారు. సాయంత్ర కూడా అదే విధంగా ఐదు కూరలు ఉంటాయి. ఇక ఆదివారం ఎగ్ కర్రీ, చికెన్, చేపల పులసు కూడా పంపిస్తారు. వారిచ్చే మెను చూస్తూ ఎవరైనా ఆ ఆహారాన్ని ఇష్టం తింటారు. తామెదో వ్యాపార పరంగా ఆలోచించి ఈ మెస్ నిర్వహించడలేదని, కేవలం సేవా దృక్పదంతోనే చేస్తున్నామంటున్నారు లక్ష్మీ. వృద్దులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారికి సకాలంలో ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. కాబట్టి క్రమ తప్పకుండా సకాలంలో వారికి ఆహారాన్ని అందించడంతోనే ఎక్కువ మంది తమకు ఆహారం కావాలని అడుగుతున్నారని ఆమె తెలిపారు.

ఏది ఏమైనా ఒంటరి వృద్దుల కోసం అతి తక్కువకే ఆహారం అందిస్తున్న లక్ష్మీని పలువురు పుర ప్రముఖులు అభినందిస్తున్నారు.