Netherlands: 14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్‌పై ఇంటికి..

www.mannamweb.com


Netherlands: 14 ఏళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన నేత పదవి నుంచి దిగిపోతూ సైకిల్‌పై వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

నెదర్లాండ్స్‌ (Netherlands)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధానిగా డిక్‌ స్కూఫ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మార్క్‌ రుట్టే (Mark Rutte).. కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సింపుల్‌గా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు. సైకిల్‌ నడుపుకుంటూ సిబ్బందికి టాటా చెబుతూ వీడ్కోలు పలికారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి. ఈ వీడియోను రిటైర్డ్‌ పోలీసు అధికారిణి, పుదుచ్చేరి మాజీ గవర్నర్‌ కిరణ్‌ బేడీ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో మార్క్‌ రుట్టేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికార మార్పిడి ఇలా శాంతియుతంగా, ఆనందంగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

2010లో రుట్టే తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా ఆయనే పదవిలో కొనసాగుతూ వచ్చారు. అయితే, వలసలను నియంత్రించే విధానంపై సంకీర్ణ ప్రభుత్వంలో అంగీకారం కుదరలేదు. దీంతో గతేడాది జులైలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. రుట్టే ప్రధానిగా రాజీనామా చేయగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ బాధ్యతలు కొనసాగించారు.

గతేడాది చివర్లో నెదర్లాండ్స్‌లో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పలేదు. అయితే, ప్రధాని పీఠంపై ఏకాభిప్రాయం కుదరడంలో ఆలస్యం కావడంతో చివరకు గత మంగళవారం డిక్‌ స్కూఫ్‌ అధికారికంగా పీఎం బాధ్యతలు చేపట్టారు.