సీబీఎస్‌ఈ పదోతరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత

రాష్ట్రంలో పదోతరగతి సీబీఎస్‌ఈ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యపుస్తకాన్ని ఈ ఏడాది మార్పు చేసింది.


అమరావతి: రాష్ట్రంలో పదోతరగతి సీబీఎస్‌ఈ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యపుస్తకాన్ని ఈ ఏడాది మార్పు చేసింది. కానీ, ఈ విషయాన్ని సకాలంలో సీబీఎస్‌ఈ బోర్డుకు చెప్పలేదు. దీంతో సీబీఎస్‌ఈ బడుల్లో పాత తెలుగు అమలుకే ఆ బోర్డు గత ఏప్రిల్‌లోనే ఆదేశాలు ఇచ్చింది. దీన్ని పట్టించుకోని పాఠశాల విద్యాశాఖ పాత పాఠ్యపుస్తకాలను ముద్రించలేదు. కొత్తవాటినే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పుడు ప్రైవేటు, ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలుగు పుస్తకాలు దొరకడం లేదు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నారు. వీటిల్లో 83 వేల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి అందించేందుకు పాత తెలుగు పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. గతేడాది ముద్రించినవి 30 వేలు ఉంటే వీటిని పంపిణీ చేశారు. మిగతా 53 వేల మంది తెలుగు పుస్తకాలు లేకుండా తరగతులకు హాజరుకావాల్సి వస్తోంది. ప్రైవేటు సీబీఎస్‌ఈ బడుల్లో చదివే విద్యార్థులదీ ఇదే పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఆరో సబ్జెక్టుగా ఐటీని ప్రవేశపెట్టనున్నారు. వీటి పాఠ్యపుస్తకాలను కూడా ఇంతవరకు ముద్రించలేదు.