రైతులకు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఎప్పుడు. ప్రస్తుతం రైతుల ఈ నిధుల కోసం వేచి చూస్తున్నారు. దీపావళి వేళ ఈ నిధులు జమ అవుతాయని అంచనా వేసారు.
అయితే, మూడు రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం 21వ విడత పీఎం కిసాన్ నిధులను మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. కాగా.. ఇప్పుడు ఈ నిధుల విడుదలకు దాదాపు మూహూర్తం ఖరారైనట్లు సమాచారం.
కేంద్రం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు ఇప్పటి వరకు 20 సార్లు విడుదల చేసారు. 21వ విడత నిధులను పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరద బాధితుల కోసం విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల్లోని రైతులకు విడదల పై కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో రైతులకు పీఎం కిసాన్ తో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావించినా.. వాయిదా పడింది. దీంతో, పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిని నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేసారు. 21వ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్-జూలై మధ్య 41.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు 2న జమ చేసారు. పీఎం కిసాన్ కింద ఏటా రూ.6వేలు ఇస్తుండగా, అన్నదాత-సుఖీభవ కింద రూ.14వేలు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వీటిని కేంద్రం తోపాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం.. నవంబర్ 18వ తేదీన కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు జమ చేస్తాయని సమాచారం. అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత-సుఖీభవ కింద రెండు విడతల్లో రూ.20 వేలు చెల్లించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా మొదటి విడతగా వచ్చే రూ.10వేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. లబ్ది దారుల జాబితాలను అన్నదాత-సుఖీభవ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధ్రువీకరణ చేశారు. భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-క్రాపులో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ నిధులు పొందేందుకు ఈ-కెవైసి, భూమి రికార్డుల ధృవీకరణ పూర్తి చేయని రైతులు వీలైనంత త్వరగా చేయాలి. ఈ పథకం కింద ఈ-కెవైసి, భూమి రికార్డుల ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం బీహార్ తో పాటుగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. దీంతో, పీఎం కిసాన్ నిధుల విడుదల పైన నవంబర్ తొలి వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.


































