జూన్ 2027 నాటికి పోలవరం పూర్తి చేయడానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల ఆయన జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
లక్ష్యం ప్రకారం పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయి విశాఖపట్నంకు నీటిని తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
పోలవరంలో మొత్తం 1379 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని అధికారులు వివరించారు. గత నెలలో ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటివరకు 51 మీటర్లు పూర్తయ్యాయి. మరో 1328 మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. పోలవరం, బనకచర్ల అనుసంధానం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. పోలవరం కుడి, ఎడమ కనెక్టివిటీ పనుల్లో జరుగుతున్న జాప్యంపై తదుపరి సమీక్ష నాటికి పూర్తి ప్రగతి నివేదికను సమర్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు.