సీఎం జగన్ (YS Jagan) చెప్పినట్లుగా వైసీపీకి 151 మించి అసెంబ్లీ సీట్లొస్తే తన ముఖాన పేడకొడతారని.. లేదంటే ఆయనకే అది జరుగుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) వ్యాఖ్యానించారు. ఇటీవల విజయవాడ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ .. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రభావమేమీలేదంటూ తేలిగ్గా మాట్లాడారు. ఐప్యాక్ టీమ్ హెడ్ రుషిరాజ్ బృందమే వైసీపీ కోసం కష్టపడినట్లు తెలిపారు. ఏపీలో ఫలితాలపై తాజాగా యూట్యూబ్ చానల్ మోజో జర్నలిస్ట్ బర్కా దత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ స్పందించారు.
రాసిపెట్టుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని పునరుద్ఘాటించారు. టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రానుందని తెలిపారు. దేశంలో మళ్లీ బీజేపీయే గెలుస్తుం దని స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. మళ్లీ ఆయన సారథ్యంలోనే కేంద్రంలో సర్కారు ఏర్పడుతుందన్నారు. అయితే తామే రాబోతున్నామని రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్‌లాంటివారు కూడా చెబుతున్నారని.. జగన్ మాటలూ అలాంటివేనని పీకే కొట్టిపారేశారు. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాలు ఏర్పడవన్నారు.