Praveen Prakash: ప్రవీణ్‌ ప్రకాష్‌ కొత్త ప్రావీణ్యం! ప్రభుత్వం మారాక ఇన్‌స్టా రీల్స్‌తో కొత్త అవతారం

ప్రభుత్వం మారాక ఇన్‌స్టా రీల్స్‌తో కొత్త అవతారం
గుడులు, పార్కుల్లో హిందీ పాటలకు అభినయం
ఇంత టాలెంట్‌ ఉందా అని నెటిజన్ల ఆశ్చర్యం
వైకాపాతో అంటకాగి ఇప్పుడు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు


అమరావతి: ‘అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్‌’ అని నానుడి. ప్రభుత్వ పెద్దగా చేసిన ఒకాయన ‘ఓటమి తర్వాత హిమాలయాలకు పోవాలనుకున్నానని’ మనసులో మాట బయటపెట్టారు. అప్పుడు ఆయనతో అంటకాగి తిరిగి.. అడ్డగోలుగా వ్యవహరించిన ఓ అధికారి ఇప్పుడు చెట్లు, పుట్టలు పట్టి తిరుగుతూ, నదీ తీరాల వెంట ఒంటరిగా సంచరిస్తూ.. పాటలకు అభినయిస్తూ ‘ఇన్‌స్టా’లో రీల్స్‌ చేసుకుంటున్నారు..

ఐఏఎస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ తాజా వ్యవహారమిది! మొన్నటి వరకు పాఠశాలల తనిఖీలు, పరిశీలనల పేరుతో హడావుడి చేసిన ఈయన ఇప్పుడు ఇన్‌స్టాలో రీల్స్‌ చేసుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వంలో పెద్దలకు అనుకూలంగా వ్యవహరించిన ఈయన్ని కూటమి ప్రభుత్వం ఈనెల 19న బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇప్పుడు ఖాళీగా ఉండి రీల్స్‌ చేస్తున్నారా? లేక దీని వెనుక ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానది తీరాన, పార్కుల్లో, గుడిలో.. ఇలా పలుచోట్ల ఆయన వీడియోలు చేస్తున్నారు. హిందీ పాటలకు హావభావాలను ఒలికిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన్ని ఓ ఉన్నతాధికారిగా చూసినవారు ఇప్పుడు ఈ కొత్త అవతారంలో చూసి ఆశ్చర్యపోతున్నారు.

కూటమి ప్రభుత్వం వస్తుందని ముందే తెలుసా?
వైకాపాతో అంటకాగిన ప్రవీణ్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ ఎన్నికల ముందు నుంచి సహచరులతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. తనకో మంచి ప్రైవేటు కొలువు చూడాలంటూ అప్పట్లో ఓ ఐఏఎస్‌ను కోరడం.. వాట్సప్‌లో సందేశం పంపడం చర్చనీయాంశమైంది. నంద్యాల జిల్లాలో బడి ఈడు పిల్లలు బడి బయట కనిపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఒకసారి ప్రకటించారు. కొంతమంది అధికారులు వారించినా వినలేదు. ఒక దశలో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగింది. చివరికి ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేశారు. అయితే అందులో స్వయంగా సంతకం చేయాల్సి ఉండగా.. డిజిటల్‌ సంతకం చేయడం గమనార్హం. దీన్ని ప్రభుత్వం ఆమోదించదని తెలిసే అలా చేశారా.. అనేది కొందరి సందేహం.

ఎన్నో అక్రమాలకు సహకారం..
గత వైకాపా ప్రభుత్వంలో ఓ మంత్రి చేసిన అనేక అక్రమాలకు ప్రవీణ్‌ ప్రకాష్‌ సహకారం అందించారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపులో ఆయనకు సాయం చేశారు. రూ. 772 కోట్ల విద్యా కానుక సామగ్రి కొనుగోళ్లలో టెండర్లు లేకుండా పాతవారికే ఇచ్చేశారు. మాజీ సీఎం జగన్‌ పేషీలో పని చేసిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లెక్క చేయకుండా ప్రవర్తించినట్లు విమర్శలున్నాయి. కొంతమంది అధికారులపై తెదేపా ముద్ర వేసి ఇబ్బందులకు గురి చేశారు. విశాఖపట్నం కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోక ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల విద్యలో తనిఖీలతో హడావుడి చేశారు. ఉపాధ్యాయులను బెదిరించారు. ఇలా ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు ప్రవీణ్‌ ప్రకాష్‌!