తెలుగు రాష్ట్రాల( Telugu States) మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కృష్ణానది పై కేబుల్ బ్రిడ్జి( cable Bridge) నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు వరుసలతో కేబుల్ కం సస్పెన్షన్ బ్రిడ్జ్ గా దీనిని నిర్మిస్తున్నారు. పైనుంచి వాహనాలు.. కింది నుంచి గాజు గ్లాస్ తో ప్రకృతి ఆస్వాదించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి మధ్య ప్రయాణ దూరం దాదాపు 90 కిలోమీటర్లు తగ్గనుంది. ఇది నిజంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు గుడ్ న్యూస్. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే తిరుపతికి ప్రయాణ సమయం, దూరం తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సమాచారం.
* దేశంలోనే తొలి ప్రాజెక్ట్..
దేశంలోనే తొలిసారిగా ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం( central government) ముందుకు రావడం శుభ పరిణామం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సరి కొత్త ప్రయత్నం అన్నమాట. కృష్ణా నదిపై ఈ బ్రిడ్జి అందుబాటులోకి రానందన్నమాట. ఈ మేరకు భారీ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఆమోదముద్ర వేసింది. మూడు రోజుల కిందట ఢిల్లీలో భేటీ అయిన ఆ కమిటీ.. బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* టెంపుల్ టూరిజం లో భాగంగా..
టెంపుల్ టూరిజంలో( Temple tourism) భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చినట్లు సమాచారం. కృష్ణా నది అవతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి.. ఇటు ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ రెండు వరుసల కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. మూడేళ్ల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా పనులు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలోకి మార్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది.
* 800 మీటర్ల పొడవుతో..
దాదాపు 800 మీటర్ల పొడవులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని నిర్మాణానికి రూ. 1062 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించారు. రెండు వరుసలతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి( cable suspension bridge ) నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణా నదిపై సోమశిల వద్ద మొదలై .. రెండు వరుసలతో దీనిని నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేబుల్ కం సస్పెన్షన్ బ్రిడ్జితో నిర్మిస్తున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించేవారు ప్రకృతి అందాలను వీక్షించేందుకుగాను గాజుతో కూడిన నడకదారిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి నిర్మాణం దేశంలో ఎక్కడా లేదని తెలుస్తోంది. తొలిసారిగా సోమశిల వద్దనే దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటుతో తెలంగాణ నుంచి తిరుపతి మధ్య దూరం 90 కిలోమీటర్ల మేర తగ్గనుంది.
* వచ్చే నాలుగేళ్లలో పూర్తి..
ప్రస్తుతం తెలంగాణ నుంచి తిరుపతి( Lord Tirupati) వెళ్లాల్సిన భక్తులు కర్నూలు మీదుగా వెళుతున్నారు. కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా ఈ కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. దాదాపు కిలోమీటర్ ఉండే ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే.. 90 కిలోమీటర్ల మేర ప్రయాణ భారం తగ్గుతుంది. మరో రెండు మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని చూస్తోంది. 2029 ఎన్నికలకు ముందే దీనిని ప్రారంభించాలని భావిస్తోంది.