నాటి బడి చదువులు – నేటి వాస్తవం – రేపటి అవసరాలు : – డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్

నాటి బడి చదువులు – నేటి వాస్తవం – రేపటి అవసరాలు :


– డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్

30-40 సంవత్సరాల క్రితం వసతులు లేని వానాకాలం బడులలో తెలుగు మీడియంలో చదివిన వారు , 6 వ తరగతి లో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకున్నవారు …. అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 1990 లలో వచ్చిన సాంకేతిక మార్పులు, దేశంలోని ఆర్థిక విధానాల మార్పుల వలన దేశవిదేశాలలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి . ముఖ్యంగా సాప్ట్ వేర్ మరియు ఫార్మా రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి . ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న భారతీయ యువతలో అత్యధిక శాతం ప్రభుత్వ బడులలో , మాతృభాషా మాధ్యమంలో చదువుకున్నవారే . వాస్తవానికి వారిలో అత్యధికులు 6 వ తరగతిలో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకున్నవారే! ఈ ఉద్యోగ అవకాశాలను మధ్యతరగతి పట్టణ , గ్రామీణ యువత ఎక్కువగా అందుకున్నారు. కొత్త టెక్నాలజీ లో వారికి కాలేజీలలో శిక్షణ లేకపోయినా ; ప్రభుత్వాలు ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ , శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయకపోయినా … లక్షలాది మంది యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

దానికి ప్రధాన కారణాలు

అ) ‘ బడి ‘ వారికి చదవడం , రాయడం , సాధారణ లెక్కలు చేయడం వంటి బేసిక్ స్కిల్స్ పటిష్టంగా నేర్పింది.

ఆ) లెక్కలు బాగా చేయడం ద్వారా వారికి లాజిక్ , క్రిటికల్ థింకింగ్ అనే నైపుణ్యాలు బాగా అలవడ్డాయి. నిజానికి ఇవే సాప్ట్ వేర్ ఉద్యోగానికి కావలసిన అతి ముఖ్యమైన నైపుణ్యాలు.

ఇ ) చాలా మంది విద్యార్థులు టెస్ట్ బుక్స్ మాత్రమే చదివేవారు. ఒక వేళ గైడ్ లు చదివినా, అది వారికి కష్టమైన సబ్జెక్ట్స్ లోనో / మాష్టార్లు లేని సబ్జెక్టు లలో మాత్రమే చదివేవారు. తద్వారా సెల్ఫ్ లెర్నింగ్ behaviour వారికి అలవాటు అయ్యింది. టెస్ట్ బుక్ చదవకుండా నోట్స్ మాత్రమే చదవటం అనేది వారికి అలవాటు చేయబడలేదు.
కొంతమంది ఉపాధ్యాయులు అయితే నోట్స్ / గైడ్ లను చదవడాన్ని పూర్తిగా వ్యతిరేకించే వారు.

ఈ) విద్యార్థి చదివిన దానికి , వ్రాసిన దానికి మాత్రమే మార్కులు వేసేవారు. అప్పటి విద్యార్థుల మార్కులు పూర్తిగా వారి కష్టార్జితం . ఇందులో ఎవరి దయ , దాక్షిణ్యం లేదు.
ఆ మార్కులు ఎవరో వారికి ఉదారంగా, అయాచితంగా వేసినవి కావు. పేపర్లు సులువుగా ఇవ్వడం ద్వారా వారు మార్కులు తెచ్చుకొన్నవారు కాదు! బడిలోని ‘పరీక్షలు’ వారికి కష్టపడటం అనేది జీవితంలో భాగం అని తెలియజెప్పాయి మరియు అది జీవిత విలువలుగా మారేటట్లు చేశాయి .

ఉ) అప్పటి బడులలో , ఇంట్లో వసతుల లేమి అనేది వారికి పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవడం , పొదుపు చేయడం మరియు లక్ష్యాన్ని చేరడం నేర్పాయి.

‘ నాలుగు- ఐదు ‘ సంవత్సరాలు బడికి హాజరు అయిన వారికి చదవడం , రాయడం రాకపోవడం అనేది ఉండేది కాదు. బడి తయారు చేసిన నిరక్షరాస్యులు (Schooled illiterates ) అనే వారు దాదాపు ఉండేవారు కారు.

**************

నేటి వాస్తవం :

గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో ‘బడిఈడు’ పిల్లలు నేర్చుకునే తీరుతెన్నులు , వారి స్వభావాలు ( Learning attitudes & Behaviours ) , ప్రస్తుత వాస్తవ అభ్యసనాస్థాయిలను ( Actual Learning levels ) పరిగణలోకి తీసుకోకుండా ; పిల్లల భవిష్యత్ ను గాలికి వదిలేసి, పార్టీ ల యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పాఠశాల విద్యావిధానాలు రూపొందించి , తల్లిదండ్రులకు మాత్రం అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు .

విద్యాశాఖ 2022 జూలై లో అన్ని ప్రభుత్వ బడుల్లో బేస్ లైన్ పరీక్ష నిర్వహించింది. గడచిన 25 సం. రాలలో విద్యాశాఖ మరియు ఉపాధ్యాయులు నిజాయితీగా నిర్వహించిన ఏకైక పరీక్ష ఇది. ఈ పరీక్ష ‘శాంపిల్ సర్వే ‘ కాదు. ప్రభుత్వ బడికి రోజూ హాజరయ్యే ప్రతీ విద్యార్థి బేస్ లైన్ పరీక్ష వ్రాసారు . బేస్ లైన్ పరీక్ష ఫలితాల ప్రకారం ‘ 6,7,8 తరగతులు చదివే విద్యార్థుల్లో

అ) 41.5 % మందికి సరళమైన తెలుగు వాక్యాలు ఉన్న ఈ క్రింద పేరా కూడా చదవటం రాదు.
“మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాము. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది. “

ఆ ) 65.2% మందికి మూడు సరళ ఇంగ్లీషు పదాలు మాత్రమే ఉన్న ఈ క్రింది చిన్న వాక్యాలు కూడా చదవటం రాదు.
a) what is the time?
b) This is a large house .
c) I like to read
d) she has many books

ఇ ) 58.6% మంది కి ఈ క్రింద ఇచ్చిన చిన్నపాటి భాగాహారాలు కూడా చేయడం రాదు.
a) 37/2
b) 58/4
c) 79/6

ఇవి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సామర్థ్యాలు . కనీస సామర్థ్యాలు అయిన చదవడం , వ్రాయడం , చిన్న చిన్న లెక్కలు చేయడం కూడా రావడం లేదు. 10 సం. రాలు బడికి వెళ్ళాక కూడా బడి లక్షలాది పేద పిల్లలను నిరక్షరాస్యులు గానే సమాజంలోకి పంపుతుంది.

బడి పిల్లలకు కనీస నైపుణ్యాలు లేకపోవడానికి , ఇంగ్లీష్ మీడియం కు అవినాభావ సంబంధం ఉంది . 2005 నుండి ప్రతీ సంవత్సరం ప్రధమ్ సంస్థ విడుదల చేస్తున్న ‘ అసర్ ‘ నివేదికల ప్రకారం ‘ ఒక వైపున ఇంగ్లీష్ మీడియం పెరిగేకొలది , మరోవైపు కనీసం చదవడం రాయడం రాని విద్యార్ధుల శాతం కూడా గణనీయం గా పెరుగుతుంది.

‘ప్రపంచ బ్యాంక్ 2018 లో విడుదల చేసిన రిపోర్ట్ ‘ Learning : To realise Education’s promise’ 77 వ పేజీ లో ఈ విధంగా ఉంది “ ధారాళంగా చదవలేని వ్యక్తులు మార్కెట్ లోని ఉపాధి అవకాశాలు అందుకోలేరు, తదుపరి విద్యావకాశాలు కూడా ఉపయోగించుకోలేరు . త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న ఆధునిక మార్కెట్ లలో వచ్చే అత్యధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలను వీరు పొందలేరు , ఎందుకంటే ఉద్యోగ శిక్షణకు కూడా సాధారణంగా చదివే స్థాయి కన్నా మెరుగైన నైపుణ్యాలు ( reading competency beyond minimum proficiency ) ఎంతో అవసరం.

******************

రేపటి అవసరాలు :

కృత్రిమ మేధ (Artificial intelligence) యుగం లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే మన విద్యార్థులకు బడిలో నేర్పాల్సిన నైపుణ్యాలు ‘ సృజనాత్మకత , విమర్శనాత్మక ఆలోచన ‘.
ఇవి రావాలంటే పిల్లలకు కథలు చెప్పడం – వారి చేత చెప్పించడం , ఆర్ట్స్ , సంగీతం అనేవి ప్రాథమిక దశ నుండి ఉన్నప్పుడే వారికి సృజనాత్మకత వస్తుంది.

బడులలో ( ప్రభుత్వ / ప్రైవేట్ ) అంతర్జాతీయ స్థాయి సైన్స్ ల్యాబ్ లు ఉన్నప్పుడే … వారిలో శాస్త్రీయ సృజనాత్మకత పెరుగుతుంది.

Language labs ద్వారా వివిధ భాషలలో నైపుణ్యాన్ని పెంచి సాహిత్యం చదవడం అలవాటు చేయడం సృజనాత్మకత పెంపుదలకు ఎంతో అవసరం.

గూగుల్ CEO ‘ సుందర్ పిచాయ్ ‘ ఈ విధంగా చెప్పారు ‘ సబ్జెక్టు లను బట్టీ పట్టడం కాకుండా , వాటిని పూర్తిగా అవగాహన ఆకళింపు చేసుకోవాలి , అప్పుడే రాబోయే రోజులలోని సాంకేతిక మార్పులను అర్ధం చేసుకొని , అవకాశాలను అందిపుచ్చుకోగలరు అని’ .

ఇవి సాధ్యపడాలంటే రెండు విషయాలు ప్రధానంగా జరగాలి

a) సృజనాత్మకత , విమర్శనాత్మక ఆలోచన అనే విషయాలలో ప్రవేశం కల్పించడానికి , నైపుణ్యం సాధించడానికి చాలా సమయం పడుతుంది. అంత సమయం విద్యార్థికి ఒత్తిడి లేకుండా దొరకాలంటే ఏకైక మార్గం ” మాతృభాషా మాధ్యమం లో బట్టీ పట్టాల్సిన అవసరం లేని నాణ్యమైన విద్య ను అందించడం” .

b) పరీక్షల నిర్వహణ లోనూ, మూల్యాంకనం లోనూ పారదర్శకత ఉండాలి.

ఇవి చేయడానికి స్వల్పకాలిక రాజకీయ లబ్ది కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రభుత్వాలు కాదు , ముందు చూపుతో ప్రజలను నడిపించే దార్శనికులు నాయకత్వం వహించే ప్రభుత్వం కావాలి.