Ragi Pindi Punugulu : రాగి పిండితో పునుగుల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

www.mannamweb.com


Ragi Pindi Punugulu : మ‌న ఆరోగ్యానికి రాగిపిండి ఎంతోమేలు చేస్తుంది. ఎముకల‌కు బ‌లాన్ని చేకూర్చ‌డంలో, శ‌రీరాన్ని ధృడంగా చేయ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా రాగిపిండి మ‌న‌కు మేలు చేస్తుంది. ఈ మ‌ధ్య‌కాలంలో రాగిపిండితో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తున్నాము. రాగిపిండితో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వెరైటీ వంట‌కాల్లో రాగి పునుగులు కూడా ఒక‌టి. రాగిపునుగులు చాలా రుచిగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం అల్పాహారం చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాగిపునుగులను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి… ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పునుగుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోశ‌పిండి – ఒక గిన్నె, రాగిపిండి- ఒక చిన్న క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2 లేదా 3, అల్లం తురుము – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

రాగి పునుగుల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో దోశ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో రాగిపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌లపాలి. త‌రువాత త‌గిన‌న్నినీళ్లు పోసి పునుగుల పిండి లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పునుగుల గిన్నెను ఉంచి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండి వేసి మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మ‌రో వైపుకు తిప్పి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి పునుగులు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి. ఈ పునుగుల త‌యారీలో దోశ‌పిండి లేని వారు దానికి బ‌దులుగా గోధుమ‌పిండి, రాగిపిండి, మ‌జ్జిగ క‌లిపి కూడా చేసుకోవ‌చ్చు. ఈ విధంగా తయారు చేసిన రాగి పునుగుల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తీసుకోవ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.