AP Weather: ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్ వచ్చేసింది. ఏపీలోని ఈ జిల్లాలకు వర్షాలు..

ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్ వచ్చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.


దీని ప్రభావంతో మే 22, బుధవారం విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మే 23, గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మంగళవారం రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పలలో 26.5, చిత్తూరులో 22.5, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.