Rains: చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు..!

www.mannamweb.com


ఈఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల నుంచే భానుడు తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. మాడు పగిలే ఎండలతో జనాలు విలవిల్లాడుతున్నారు. మార్చి నెల నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇక ఏప్రిల్ మాసం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మండే ఎండలకు తోడు.. వడగాలులు వీస్తుండటంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏసీ, ఫ్రిజ్జులు కూడా వేసవి తాపాన్ని తీర్చలేకపోతున్నాయి. మరో రెండు నెలల పాటు ఎండలను ఎలా భరించాలా అని జనాలు భయపడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి అని వెల్లడించింది. ఆ వివరాలు..

ఎండ వేడిమి, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. వేసవిలో ఈ అకాల వర్షాలు ఎందుకు అంటే.. ఉత్తర కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు… ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది.

ఇక తెలంగాణలో కూడా ఉపరితల ద్రోణి ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. మిగతా జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మరీ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో ఇవాళ జోగులాంబ జిల్లా వడ్డేపల్లిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది.

ఉపరిత ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 40 డిగ్రీలకుపైన నమోదైన ఉష్ణోగ్రతలు ఈ రెండు రోజుల్లో 35-40 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.