ప్రస్తుతం సహజంగా పండించే పండ్లు, కూరగాయలు చాలా తక్కువ. అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. వాటిని పండించే క్రమంలో వాటిపై పురుగు మందులు కొడుతుంటారు. వాటిని శుభ్రంగా కడిగి తినకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
ఈ క్రిమిసంహారక మందులు తొలగేలా వాటిని ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.. పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. సమతుల్య ఆహారం కోసం వీటిని కూడా తింటూ ఉండాలి. అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, మామిడిపండ్లు, జామకాయలు.. ఇలా అన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అయితే వీటన్నింటిని క్రిమిసంహారక మందుల ద్వారా పండించడం అధికమైంది కాబట్టి రసాయనాలు నిండిన పండ్లను అలాగే తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
పండ్లు కొన్నాక వాటిని నేరుగా తినకూడదు. ఇంటికి తెచ్చాక కొంత సేపు వాటిని నీటిలో నాన బెట్టాలి. పండ్లు మునిగే వరకు నీటిలో వేసి నానబెట్టాలి. అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత వాటిని చేతితో రుద్దుతూ… శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే వాటిపైనున్న పెస్టిసైడ్స్ పోయే అవకాశం ఉంది. రెండో పద్ధతి ఏమిటంటే.. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి అందులో ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి అరగంట పాటు వదిలేయండి.
ఆ తర్వాత ఆ పండ్లను చేతితోనే శుభ్రంగా రుద్ది మరొకసారి కొళాయి కింద పెట్టి నీటిలో కడగండి. అలా కాకుండా స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు వేసి మరిగించండి. కాస్త గోరువెచ్చగా అయినప్పుడు పండ్లను ఆ నీటిలో ఒక నిమిషం పాటు నానబెట్టండి. ఆ తర్వాత వెంటనే తీసి చల్లని నీటిలో వేయండి. వెనిగర్ పండ్లపై ఉన్న రసాయణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి.
ఆ నీటిలో పండ్లను వేసి ఒక నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత వాటిని తీసి కొళాయి కింద పెట్టి చేత్తో రుద్ది కడగండి. ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది. పండ్లను కడిగేందుకు అది కూడా బాగా పనిచేస్తుంది. నీటిలో ఈ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి పండ్లను వేసి నానబెట్టాలి. ఆ తర్వాత ఆ పండ్లను తీసి కుళాయి కింద ఉన్న నీటిలో రుద్ది కడగాలి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే పండ్లను తప్పకుండా కడిగే తినాలి. లేదంటే రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.