రుషికొండ ఫైళ్లు మాయం

www.mannamweb.com


విశాఖపట్నంలో రుషికొండ విధ్వంసం, కొండపై ప్యాలెస్‌ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి.

విశాఖపట్నంలో రుషికొండ విధ్వంసం, కొండపై ప్యాలెస్‌ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ప్యాలెస్‌ నిర్మాణ అనుమతుల ఫైళ్లు, కొన్ని ముఖ్యమైన పేపర్లు ఇప్పటికే కనిపించడంలేదు. ఇప్పుడు కొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గల్లంతయ్యాయి. ఆ రిసార్టులో 80 గదులతో పాటు ఒక పంక్షన్‌ హాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉండేవి. వాటిల్లో ఉండాల్సిన దాదాపు రూ.50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర సామగ్రి ఏమైందో తెలియక ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్యాలెస్‌ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏంచేశారో వివరించే ఫైల్‌ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్‌ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైల్‌ ఏపీటీడీసీ వద్ద ఉండేది.

ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం రిసార్ట్‌ను తొలగించే సమయంలో అందులోని సామగ్రిని ఇతర రిసార్ట్‌లకు పంపడం లేదా వాటికి తగిన ధరను నిర్ణయించి, టెండర్‌ ద్వారా బయట మార్కెట్‌లో అమ్మడం చేయాల్సి ఉంటుంది. రుషికొండ విషయంలో టూరిజం అధికారులు ఈ నిబంధనలేవీ పాటించలేదు. ప్యాలెస్‌ నిర్మాణం కోసం ఆగమేఘాల మీద రిసార్ట్స్‌ను ధ్వంసం చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో కొంతమంది డీవీఎంలను పిలిపించి అక్కడున్న ఫర్నిచర్‌లో ఏమేం కావాలో వాటిని వారి డివిజన్లకు తీసుకువెళ్లాలని సూచించారు. వారు తీసుకెళ్లగా ఇంకా మిగిలిన సామగ్రిని ఏపీటీడీసీ అధికారులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేశారు. డీవీఎంలు ఏమేం తీసుకెళ్లారు, మార్కెట్‌లో ఏం అమ్మారనే సమాచారం కార్పొరేషన్‌ వద్ద లేదు. రుషికొండపై రిసార్ట్స్‌ తొలగించే సమయంలో ఈడీగా ఉన్న మల్‌రెడ్డి, ఈఈ రమణ తూతూమంత్రంగా ఫైల్‌ నడిపించారు. ఇప్పుడు అదీ మాయమైంది. రుషికొండ ధ్వంసం, కొత్త ప్యాలెస్‌ నిర్మాణంలో వీరిద్దరిదే కీలక పాత్ర. ఒక్క ఫైల్‌కు కూడా కార్పొరేషన్‌కు వెళ్లకుండా, సచివాలయం నుంచి చక్రం తిప్పారని ఆరోపణలున్నాయి.

రుషికొండపై మాజీ సీఎం జగన్‌ రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్‌ నిర్మాణం చేపట్టారని, ఇప్పుడా ప్యాలె్‌సను ఏం చేయాలో పాలుపోవడం లేదని కూటమి నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. కానీ అసలు దాని నిర్మాణానికి సహకరించిన అధికారులపై దృష్టి పెట్టడం లేదు. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం వెనక కీలకంగా వ్యవహరించిన మల్‌రెడ్డి 2019లో డిప్యుటేషన్‌పై తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. అప్పట్లో ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి మరీ ఆయనను రాష్ట్రానికి రప్పించింది. తిరిగి ఆయన తెలంగాణకు వెళ్లే సమయంలో కూడా ఇదే నిబంధనలు పాటించాలి. కానీ ఏపీటీడీసీ అధికారులు మాత్రం టూరిజం సెక్రటరీ అనుమతి లేకుండా, జీవో ఇవ్వకుండానే ఆయన్ను రిలీవ్‌ చేసేశారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో రిపోర్టు చేసి రూరల్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌లో విధుల్లో చేరిపోయారు. పైగా ఆ కార్పొరేషన్‌ ఎండీ పోస్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రమణ… ఇరిగేషన్‌ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీటీడీసీకి వచ్చారు. ప్యాలెస్‌ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నారు. కార్పొరేషన్‌ అధికారులు ఆయన్ను విశాఖ డివిజనల్‌ మేనేజర్‌ పోస్టులో కూర్చోబెట్టడంతో పాటు టూరిజం శాఖ రీజినల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు కూడా అప్పగించారు. రుషికొండకు సంబందించిన ఫైళ్లన్నీ డీవీఎం చేతుల్లోనే ఉంటాయి. జగన్‌ ప్రభుత్వంలో మొత్తం వ్యవహారం నడిపించిన ఈయనకు పదోన్నతులు ఇచ్చి, కీలకమైన పోస్టు కట్టబెట్టడంపై సంస్థ ఉద్యోగులు విస్తుబోతున్నారు. రుషికొండ విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉందో ఈ ఒక్క నిర్ణయంతో తేలిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.