సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలి ఎక్కడ తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డు అందించేందుకు యోచిస్తోంది.


ఈ కార్డు పొందేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే పొందవచ్చు.

దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటినవారికి సీనియర్ సిటిజన్ కార్డు అందించనుంది. ఈ కార్డు డిజిటల్ రూపంలో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో పొందేందుకు వీలుంటుంది. మీ సేవ, ఇంటర్‌నెట్ కేంద్రాల నుంచి కూడా తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డును ఏ విధమైన రుసుము లేకుండా ఉచితంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా అందుకోవచ్చు. ప్రతిసారీ వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్ కార్డు ఆధారంగా ఆ వ్యక్తి వయస్సు ఎంతో తెలిసిపోతుంది. ప్రతిసారీ ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు రుజువుగా చూపించాల్సిన అవసరం లేదు. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు.

సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉంటే కోర్టుల్లో కేసుల విచారణలోనూ ప్రాధాన్యత లభిస్తుంది. పాస్‌పోర్ట్ సేవా ఫీజుల్లో 10 శాతం రాయితీ పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. 80 ఏళ్లు దాటితే 1 శాతం వడ్డీ అదనంగా
ఉంటుంది.

సీనియర్ సిటిజన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి

ఈ కార్డు కోసం 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళకు అప్లై చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆఫీసులో కూడా పొందవచ్చు. జిల్లా కార్యాలయంలో ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ రోజే కార్డు మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, వయస్సు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు, బ్యాంక్ ఎక్కౌంట్, ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

ఇక పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. 60 ఏళ్లు పైబడితే 3 లక్షల వరకు 80 ఏళ్లు దాటితే 5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80 సి కింద మినహాయింపు ఉంటుంది.