టీడీపీలో సీనియర్లకు పొగ!

పార్టీపై పూర్తి పట్టు కోసం లోకేశ్‌ ఎత్తులు


కొత్త వారికి అవకాశం పేరుతో పాత వారికి ఉద్వాసన!

సీనియర్ల వల్ల ఉపయోగం లేదని.. పార్టీకి భారమని ముద్ర

పొలిట్‌ బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో భారీ మార్పులు..

లోకేశ్‌ చెప్పిన వారికే పదవులు

సానా సతీష్, రామ్మోహన్‌ నాయుడు, కేశినేని చిన్ని వంటి వారికి ప్రాధాన్యం!

యనమల, సోమిరెడ్డి, బుచ్చయ్య తదితరుల శకం ముగిసినట్టే

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ పార్టీలోని సీనియర్లకు పొగ పెడుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలోని సీనియర్లను బయటకు పంపేసి, పూర్తిగా తన మనుషులతో నింపేందుకు లోకేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా తలొగ్గడంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్‌ నేతలకు గడ్డుకాలం వచ్చింది. సీనియర్ల వల్ల ఎటువంటి ఉపయోగంలేదని, పార్టీకి భారమన్న ముద్ర వేసి వారిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగా పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఉన్న పలువురు సీనియర్‌ నేతలకు త్వరలోనే ఉద్వాసన పలుకుతారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్‌ (చిన్ని), గంటి హరీష్‌ మాధుర్, దీపక్‌రెడ్డి వంటి వారికి లోకేశ్‌ టీంగా పార్టీలో కీలక పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.

పార్టీపై లోకేశ్‌ పట్టు బిగిస్తుండటంతో చాలా కాలం నుంచి సీనియర్ల హవా తగ్గిపోయింది. లోకేశ్‌ అండదండలున్న నేతలు, ఆయనకు నచ్చిన వారికే పార్టీలో అవకాశాలు దక్కుతున్నాయి. చంద్రబాబు కూడా కుమారుడి మాట కాదనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సీనియర్‌ నాయకులు ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కూడా చాలావరకు లోకేశ్‌ అభీష్టం మేరకే జరిగినట్లు నేతలు చెబుతున్నారు.

కాసులిచ్చిన వారికే సీట్లు దక్కాయని అప్పట్లో అనేక మంది నేతలు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గంలోనూ లోకేశ్‌ చెప్పిన వారికే చోటు దక్కింది. మంత్రి పదవులు ఖాయమనుకున్న అనేక మంది సీనియర్లను పక్కన పెట్టి తనకు నచ్చిన వారికి, తనతో లావాదేవీలు జరిపిన వారికే లోకేశ్‌ మంత్రి పదవులు ఇప్పించారనే ఆరోపణలు వచ్చాయి.

లోకేశ్‌ చేతిలోకి పొలిట్‌బ్యూరో!
ఇప్పుడు పార్టీలోనూ అదే తరహా నియామకాలకు రంగం సిద్ధైమైనట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరోను చేతుల్లోకి తీసుకోవడానికి లోకేశ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పొలిట్‌బ్యూరో మొత్తాన్ని తన మనుషులతో నింపాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో సీనియర్‌ నాయకులైన యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి అత్యంత సీనియర్లు ఉన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో వీరెవరికీ సరైన ప్రాధాన్యం దక్కలేదు. చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నేతగా ఉన్న యనమల రామకృష్ణుడికి ఇటీవల పార్టీలో చెప్పుకోలేని అవమానాలు ఎదురయ్యాయి. కళా వెంకట్రావుకి ఎమ్మెల్యే సీటు నిరాకరించి, చివరికి వేరే చోట సర్దుబాటు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారిని పక్కన పెట్టేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కింజరాపు అచ్చెన్నాయుడికి ఇప్పుడు పార్టీలో సరైన స్థానం లేదు. పేరుకి మంత్రిగా ఉన్నా ఆయనకున్న ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే.

అన్ని జిల్లాల్లోనూ సీనియర్‌ నాయకులను కాదని కొత్తగా లోకేశ్‌కు దగ్గరైన వారికే పెత్తనం అప్పగించారు. గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారిని సైతం నియోజకవర్గాలకే పరిమితం చేశారు. వీరంతా గతంలో పార్టీలో చక్రం తిప్పినవారే. అలాంటి వారందరినీ పూర్తిగా పక్కకు తప్పించి పొలిట్‌బ్యూరోలో, ఇతర కమిటీల్లోనూ తనకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకోవడానికి లోకేశ్‌ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఒకటే పదవి ఉండేలా..
ఈ క్రమంలోనే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఒక చోటే బాధ్యత ఉండేలా చూసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ పదవులు ఉన్న వారికి ప్రభుత్వ పదవులు ఉండవని, ప్రభుత్వ పదవులు ఉన్న వారికి పార్టీలో పదవులు ఉండకుండా చూసే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇచ్చిన పదవులను కూడా రెండేళ్లకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఇదంతా పార్టీపై లోకేశ్‌ పూర్తిగా పట్టు సాధించేందుకు వేస్తున్న ఎత్తుగడలేనని సీనియర్లు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లు, ముఖ్య నాయకులకు ఇక మీదట ఇబ్బందులు తప్పవని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.