జనసేన అగ్రనేతలు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. జనసేన నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. బకెట్ గుర్తు ఉన్న నవరంగ్ పార్టీ అభ్యర్థులను పోటీ చేయొద్దని బెదిరిస్తున్నారని చెప్పారు.
పవన్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశానని షేక్ జలీల్ తెలిపారు. ఈసీని కలిసి ఎంపీ బాలశౌరితో పాటు నాదెండ్ల మనోహర్, పవన్ పై ఫిర్యాదు చేశామని చెప్పారు. బాలశౌరి తనకు తుపాకీ గురి పెట్టి బెదిరించారని ఆరోపించారు. ఏపీలో ఈసీ తన పార్టీకి బకెట్ గుర్తు కేటాయించిందని గుర్తుచేశారు.
దీంతో జనసేన గాజు గ్లాసు గుర్తు, తమ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుందని, అందుకే తన పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని చెప్పారు. రూ.5 కోట్లు ఇస్తానని పవన్ చెప్పారని తెలిపారు. అయినా తాను వారి ప్రలోభాలకు లొంగలేదని తెలిపారు. తాము లక్ష్మీనారాయణ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ గా పోటీ చేస్తున్నామని అన్నారు.