శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసం చాలా మంది నాన్ వెజ్ తినకుండా.. నిష్ఠగా పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమయంలో కొత్తగా, ఈజీగా అయిపోయే రెసిపీల్లో వంకాయ పచ్చి కారం కూడా ఒకటి.
ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలతోనే.. చాలా సులభంగా చేయవచ్చు. వంకాయతో ఏలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ వంకాయ పచ్చి కారం ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పచ్చి కారానికి కావాల్సిన పదార్థాలు:
వంకాయలు, పసుపు, ఉప్పు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, ఆయిల్.
వంకాయ పచ్చి కారం తయారీ విధానం:
ఈ వంకాయ పచ్చి కారం వేపుడు తయారు చేయడానికి ముందుగా లేత వంకాయలను తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఉప్పు, పసుపు వేసిన నీటిలో పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీలోకి కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోవాలి. అప్పుడే వేపుడు మాడకుండా బాగా వేగుతుంది.
ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఎండు మిర్చి, పసుపు వేసి వేయించాక.. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని వేసి వేయించాలి. ఇవి మీడియం మంట మీద 70 శాతం ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, పచ్చి కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా చిన్న మంట మీద చేయండి. వేపుడు మాడుతుంది అనిపిస్తే.. కొద్దిగా నీళ్లు వేయవచ్చు. ఇలా పది నిమిషాలు వేయిస్తే.. వేపుడు సిద్ధం. ఈ వేపుడిని వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బావుంటుంది.