మరో ఆరు రోజులు. నేటి(మంగళవారం) నుంచి ఈ నెల 13న పోలింగ్ జరిగే నాటికి.. కేవలం ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. ఐదేళ్ళపాటు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకునేందుకు.. ఏపీలో పాలన మార్చాలా.. లేక కొనసాగించాలా? అని నిర్ణయించుకునేందుకు మిగిలిన సమయం కేవలం ఆరు రోజులు మాత్రమే. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేయాలి? ఎవరిని గద్దె నెక్కించాలని భావిస్తున్నారు.. అనేది కీలక అంశంగా మారింది.
ఈ కోణంలో చూసుకుంటే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇదే సమయం లో ఒక పార్టీపై మరోపార్టీ పైచేయి సాధించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఓవర్ టేక్ పాలిటిక్స్ కు ఇప్పుడు ఏపీ కేరాఫ్‌గా మారిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయాన్ని టీడీపీ తెరమీదికి తెచ్చింది. దీనివల్ల వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజల భూములు లాగేసుకుంటున్నారని చెబుతోంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ముందు లైట్ తీసుకున్న వైసీపీ తర్వాత.. అలెర్ట్ అయింది.
ఇప్పుడు ఆత్మరక్షణలోనూ వైసీపీ నేతలు అల్లాడుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ మరో విషయాన్ని తెచ్చి.. టీడీపీ కూటమిని డిఫెన్స్‌లో పడేసింది. అదే మైనారిటీ రిజర్వేషన్లు. కూటమి అధికారంలోకి వస్తే.. మైనారిటీ ముస్లింలకు రక్షణ, రిజర్వేషన్ కూడా ఉండబోవని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇది కూటమిలో టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామం నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
ఇలా.. మొత్తంగా ఏపీలో అయితే.. భిన్నమైన రాజకీయం హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వే.. ఇప్పటి వరకు సాగిన ఒపీనియన్ పోల్స్‌ను సైతం తిరగరాసేలా.. ఈ ప్రజాభిప్రాయం రాజకీయాలు రెండు ఉండడం గమనార్హం. మొత్తంగా చూస్తే. ఇప్పటికీ.. ప్రజలు ఒక నిర్ణయానికి రాలేదన్నది నిర్వివాదాంశం. పైగా.. జరుగుతున్న ప్రచారంలోనూ.. వారికి అసంతృప్తి ఉంది.
కీలకమైన ప్రత్యేక హోదా, కడప ఉక్కు, విభజన సమస్యలు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడం వంటివి కీలకం. వీటిని ఎవరూ ప్రస్తావించడం లేదు. దీంతో ప్రజల నాడి.. ఇప్పటికీ ఒకవైపే ఏకపక్షంగా ఉందనిచెప్పలేని పరిస్థితి నెలకొంది. మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో పార్టీలు వ్యవహరించే తీరు.. పైనే ఇది ఆధారపడి ఉంటుంది. మరి ఈ ఆరు రోజుల్లో పార్టీలు.. ఆయా పార్టీల అధినేతలు ఏం చేస్తారో చూడాలి.