చంద్రగ్రహణం (Lunar eclipse 2025) ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణం..
ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పాకిక్షంగా చంద్రగ్రహణం కనిపించింది. భారతదేశంలో ఆదివారం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై.. అర్థరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. గ్రహణం వీడిన తరువాత సోమవారం వేకువజామున తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు అర్చకుల సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్నాయి. అయితే, మరో పదిహేను రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది.
సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. పితృపక్షం చంద్రగ్రహణంతో ప్రారంభమైంది. సూర్యగ్రహణంతో ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం పితృపక్షంలో చివరి రోజున అంటే భాద్రప్రద మాసం అమావాస్య రోజున ఏర్పడనుంది. ఇది భారతదేశంలో కనిపించకపోయినా న్యూజిలాండ్, ఫిజి, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తుంది.
సూర్యగ్రహణం భాద్రప్రద మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే.. 22వ తేదీ తెల్లవారు జామున 3.23గంటలకు ముగుస్తుంది. ఇది అశ్విన్ కృష్ణ పక్ష అమవాస్య రోజు వస్తుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ సూర్యగ్రహణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కన్యారాశిలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యారాశిలో ఉంటారు. శనీశ్వరుడు మీనరాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటారు. కుజుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, బృహస్పతి మకరరాశిలో, శుక్రుడు, కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు.
సెప్టెంబర్ 21న సంభవించే సూర్యగ్రహణం.. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం. ఇది కన్యారాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారికి ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
గ్రహణ సమయంలో గ్రహాల అమరికలు వ్యక్తిగత జాతక చక్రాన్నిబట్టి వారికి ఎదురయ్యే సమస్యలు, కలిగే లాభాలు రెండిటినీ తెలియజేస్తాయి.
సెప్టెంబర్ 21న సంభవించే సూర్యగ్రహణం పితృపక్ష ముగింపు సమయంలో వస్తుండటంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని పండితులు చెబుతున్నారు.
































