రోటి పచ్చళ్ల రుచి అద్భుతంగా ఉంటుంది. నూనె లేకుండా చేసుకునే చింతపండు పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి రుచి వేడి వేడి అన్నంలో తింటుంటే తెలుస్తుంది. అయితే, ప్రస్తుతం ఉసిరికాయలు మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. పావుకిలో తెచ్చుకుని రోటి పచ్చడి పెట్టుకుంటే వారం రోజుల పాటు కమ్మగా పుల్లగా, కారంగా తినేయొచ్చు. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే అమృతంలా అనిపిస్తుంది.
కావల్సిన పదార్థాలు :
- ఉసిరికాయలు – 300 గ్రాములు
- నూనె – అర కప్పు
- మెంతులు – అర టీ స్పూన్
- మినప్పప్పు – అర టీ స్పూన్
- పచ్చిశనగపప్పు – అర టీ స్పూన్
- ఆవాలు – 1 టీ స్పూన్
- జీలకర్ర – అర టీ స్పూన్
- కారం – 2 స్పూన్లు (ఘాటుకు తగ్గట్లుగా)
- పసుపు – అర స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- ఎండు మిర్చి – 3
- వెల్లుల్లి – 12
- జీలకర్ర – అర స్పూన్
- కరివేపాకు – 1 రెమ్మ
- ఇంగువ – చిటికెడు
- నిమ్మరసం – 2 స్పూన్లు
-
తయారీ విధానం :
- ముందుగా 300 గ్రాముల ఉసిరికాయలను నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్‌తో తుడిచి 30 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత గింజ లేకుండా ముక్కలు కోసుకోవాలి.
- ఇపుడు కడాయిలో పావుకప్పు నూనె వేసుకుని వేడి చేయాలి. వేడెక్కగానే అర టీ స్పూన్ మెంతులు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని వేయించిన తర్వాత ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి.
- ఆ తర్వాత తాలింపు గింజలు పక్కన పెట్టుకుని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకుని కలపాలి. కాసేపు మగ్గించిన తర్వాత మూతపెట్టుకుని 10 నిమిషాల పాటు లోఫ్లేమ్‌లో వేయించాలి.
- ఇపుడు ముక్క మెత్తబడిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పోపు దినుసులను రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి. సాధ్యమైనంత మెత్తగా నూరుకున్న తర్వాత ఉసిరికాయలు రోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- కారం, పసుపు, ఉప్పు వేసుకుని నూరుకోవాలి. ఇలా నూరుకునే సమయంలో ఉసిరికాయలు కొద్దికొద్దిగా వేసుకుని నూరుకోవడం బెటర్. ముక్కలన్నీ ఒకేసారి వేసి దంచడం వల్ల సరిగా నలగవు. ఇపుడు నూరుకున్న ఉసిరికాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- కడాయిలో నూనె వేసుకుని ఎండు మిర్చి వేయించి నూనె పొంగగానే వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి ఇపుడు నూరుకున్న ఉసిరి కాయ పచ్చడిని వేసుకుని కలపాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నూనె ఎక్కువగా వేసుకుని కలపాలి. పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలిపి నిల్వ చేసుకోవాలి.


































