AB Venkateswara Rao: ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు

www.mannamweb.com


అమరావతి: గత ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. #JusticeForABV పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వేలాది మంది సంతకాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణకు ‘ఛేంజ్‌.ఓఆర్‌జీ’లో చక్కటి స్పందన లభిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఎంతో మంది ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఏబీవీకి న్యాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.

‘‘1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుటిల, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. గత అయిదేళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగు ఇవ్వలేదు. ఆయన పదవీ విరమణకు మరో 13 రోజులే ఉంది. అయినా ఇప్పటికీ విధుల్లోకి తీసుకోవట్లేదు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖకు సేవలందించిన ఏబీవీ లాంటి ఐపీఎస్‌ అధికారికి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తుండటాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఆన్‌లైన్‌లో ఉద్యమం కొనసాగుతోంది.

పోస్టింగ్‌ ఇవ్వకుండానే పదవీ విరమణ చేయించే దురుద్దేశం
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే… గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత ఐదేళ్లుగా ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలిచ్చి పది రోజులైనా ఇప్పటివరకూ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబీవీ పదవీవిరమణ చేయనున్నారు. అప్పటివరకూ తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనక ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.