నారాయణ కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే అంశాలు ఉన్నాయి


ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగర శివార్లలోని సోమలదొడ్డి దగ్గరున్న నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్ గురువారం(జనవరి 23 ) కాలేజీ మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన చరణ్ సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీకి వచ్చాడు. గురువారం ఉదయం 10.50 గంటల సమయంలో క్లాసులోంచి బయటికి వచ్చి మూడో అంతస్తు వరండా గోడ పైకెక్కి కిందికి దూకేయడం వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది.

తీవ్రంగా గాయపడ్డ చరణ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించినట్లు పోలీసులు చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు కళాశాల దగ్గర ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమేంటి? చరణ్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? కళాశాల యాజమాన్యం ఏం చెబుతోంది?

తండ్రి ఏం చెప్పారు?

సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వెంకట నారాయణ, గోవిందమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు చరణ్.

సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 20న కళాశాల తెరుచుకున్నా చరణ్ వెళ్లలేదు. 23న తన పెదనాన్న కుమారుడు భరత్ స్వయంగా చరణ్‌ను తీసుకెళ్లి కళాశాలలో వదిలి వచ్చాడు. ఆ సమయంలో పెండింగ్ ఫీజు కట్టాలంటూ కళాశాల యాజమాన్యం తనకు ఫోన్ చేయగా, వచ్చి కడతానని చెప్పడంతో చరణ్‌ను కళాశాలలోకి అనుమతించారని తండ్రి నారాయణ ఈ నెల 24న బీబీసీతో చెప్పారు. కళాశాల యాజమాన్యం నుంచి ఒత్తిడేమీ లేదని ఆయన అన్నారు.

”ఫీజు కట్టాలని కళాశాల నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు, కానీ చరణ్ ఎందుకు దూకాడో అర్థం కావడంలేదు” అని చరణ్ పెదనాన్న నారాయణ స్వామి బీబీసీతో చెప్పారు.

అయితే అంతకుముందు, 23న ఘటన జరిగిన వెంటనే కళాశాలకు చేరుకున్న చరణ్ తండ్రి వెంకట నారాయణ.. ఫీజు కట్టలేదని నిలదీయడంతో మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మీడియా ముందు ఆరోపించారు.

”కళాశాల యాజమాన్యం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. కాలేజీకి వచ్చాడు. ఫీజు కట్టలేదు అంటే.. కడతామని చెప్పాం. మా అన్న కుమారుడు వచ్చి కాలేజీ దగ్గర విడిచి వెళ్లాడు. పైకి పోయిన తర్వాత లోపల ఏం జరిగిందో ఏమో.. ఫీజు కట్టలేదని మనస్తాపానికి గురై ఇలా చేసుకున్నాడు” అని వెంకట నారాయణ ఈ నెల 23న మీడియాతో అన్నారు.

ముందు రోజు ఆయన అలా ఎందుకు చెప్పారు? రెండో రోజు అలా ఎందుకు వైఖరి మారింది? మధ్యలో ఏం జరిగింది? అనేది తెలియదు.

విద్యార్థి సంఘాల నాయకుల వాదన అయితే మరోలా ఉంది.

ఫీజుల కోసం కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సెక్రటరీ కుళ్లాయ స్వామి బీబీసీతో చెప్పారు.

”ఫీజు కట్టలేదని బయట నిలబెట్టడం వల్లే చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల్లో వందల మంది విద్యార్థులు చనిపోతున్నా వాళ్ల తీరు మారలేదు. విద్యార్థులు ఏమైపోయినా మాకు కావాల్సింది ఫీజులు అన్నట్టు నారాయణ కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తోంది” అని స్వామి అన్నారు.

రూ. 5 వేల ఫీజు పెండింగ్ ఉన్నా విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు తరగతుల్లోకి అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు.

”రూ. లక్షా 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. రూ. 5,000 పెండింగ్ ఉన్నా కూడా విద్యార్థులను లోపలికి పంపించకుండా బయట నిలబెడుతున్నారు. పూర్తిగా ఫీజు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తామంటూ విద్యార్థులపై, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల తోటి విద్యార్థుల ముందు చులకనయ్యామని భావించి, మానసికంగా ఒత్తిడికి గురై రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు” అని కుళ్లాయ స్వామి ఆరోపించారు.
కాలేజీ ఏమంటోంది?

తాము ఎప్పుడూ ఫీజుల కోసం విద్యార్థులపై, తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురాలేదని, ఇంట్లో సమస్యల వల్లే చరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని నారాయణ కళాశాల యాజమాన్యం చెబుతోంది.

బ్యాలెన్స్ ఫీజు కట్టకపోయినా తాము కళాశాలలోకి అనుమతించామని నారాయణ కళాశాల డీన్ శ్రీనివాసులు రెడ్డి బీబీసీతో చెప్పారు.

”ఆ రోజు ఆ బాబు ఫీజు రూపాయి కూడా కట్టలేదు. అయినా మేం కాలేజీలోకి అనుమతించాం. ఉదయం 9:30కి క్యాంపస్‌లోకి వచ్చాడు. వాళ్ల అన్న తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లాడు. తర్వాత క్లాసుకు వెళ్లాడు. క్లాస్‌లో కూర్చున్నాడు. ఇంటర్వెల్ అయింది. తర్వాత మళ్లీ వచ్చి క్లాసులో కూర్చున్నాడు. ఆ వెంటనే బయటకు వచ్చి, పిట్టగోడ ఎక్కి, పైనుంచి దూకేశాడు. బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. చనిపోయాడని డాక్టర్లు చెప్పారు” అని శ్రీనివాసులు రెడ్డి వివరించారు.

చరణ్ ఐఐటీ కోర్సులో జాయిన్ అయ్యాడని, మొత్తం ఫీజు రూ.లక్షా 80 వేలు కాగా తాము 30 వేలు డిస్కౌంట్ కూడా ఇచ్చామని కాలేజీ యాజమాన్యం చెప్పింది.

”డిస్కౌంట్ పోగా రూ.1,50,000 ఫీజు కట్టాలని చెప్పాం. రూ.85,000 కట్టారు. ఇంకా రూ.65,000 బ్యాలెన్స్ ఉంది. డిసెంబర్ లోపు ఫీజు కట్టాలి. కానీ మేం ఏమీ ఒత్తిడి చేయలేదు. తల్లిదండ్రులు రాకపోతే మేం వాళ్లకు కాల్ చేస్తాం. మీ బాబు వచ్చాడు, మీరు రాలేదు, ఫీజులు ఎప్పుడు కడతారు అని తండ్రిని అడుగుతాం. విద్యార్థులను అడగం. మేం బెంగళూరులో ఉన్నాం, వారం, పది రోజుల్లో వచ్చి ఫీజు చెల్లిస్తాం అని చరణ్ తండ్రి చెప్పారు. విద్యార్థులను ఫీజు అడగడం మా సిస్టంలో లేదు” అని చెప్పారు డీన్ శ్రీనివాసులు రెడ్డి.
UGCచరణ్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేత కుళ్లాయ స్వామి డిమాండ్ చేశారు
చరణ్ ఆత్మహత్యకు వారి ఇంట్లో సమస్యలే కారణమై ఉండొచ్చని నారాయణ కాలేజీ యాజమాన్యం చెబుతోంది.

”అబ్బాయి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉన్నాయి. అందుకే సూసైడ్ చేసుకున్నాడని మేం అనుకుంటున్నాం. అతని తండ్రి కూడా మాతో అదే చెప్పాడు. కాలేజీకి రాను అంటే బలవంతంగా పంపించామని వాళ్ల నాన్న చెబుతున్నారు. ఇంకో రెండు రోజులు ఆగి వెళ్తానని అన్నాడని తండ్రి మాతో చెప్పారు. చరణ్ అబౌ యావరేజ్ విద్యార్థి” అని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

అయితే ఈ ఆరోపణలపై చరణ్ తల్లిదండ్రులు స్పందించలేదు. కానీ కళాశాల యాజమాన్యం వాదనను ఏఐఎస్ఎఫ్ కొట్టిపారేస్తోంది.

చరణ్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేత కుళ్లాయ స్వామి డిమాండ్ చేశారు.

”వ్యక్తిగత సమస్యలతో విద్యార్థి చనిపోయాడని కళాశాల యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదం. సూసైడ్ చేసుకున్న వెంటనే వారు ఆ బాడీని ఎందుకు ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు రాకపోయినా, వారే తీసుకొని వెళ్లారు. అక్కడ ఉన్న రక్తపు మరకలన్నీ చెరిపేశారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని స్వామి అన్నారు.

పోలీసులు ఏమంటున్నారు?

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, విద్యార్థి తల్లిదండ్రుల వాంగ్మూలం రికార్డ్ చేశామని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు బీబీసీకి చెప్పారు.

”10:50 గంటల సమయంలో విద్యార్థి ఒక్కసారిగా మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతను చనిపోయాడని చెప్పారు. పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ల స్టేట్మెంట్ తీసుకున్నాం” అని వెంకటేశులు వివరించారు.

ఫెయిల్ అవుతానేమో అని చరణ్ భయపడేవాడని, ఆ విషయాన్ని స్నేహితులతో చెప్పినట్లు తమకు తెలిసిందని పోలీసులు చెబుతున్నారు.

”అబ్బాయి తన ఫ్రెండ్‌తో 27న జరిగే ఫ్రీ ఫైనల్ పరీక్షల్లో తాను ఫెయిల్ అవుతానేమోనని చెప్పాడని తెలిసింది. క్లాస్ మిస్ అయ్యాను, ఫెయిల్ అవుతానేమో అని చెప్పాడట. ఫీజు రూ.లక్షన్నర అయితే, రూ.85,000 కట్టేశామని, మిగిలింది కూడా ఇన్‌స్టాల్మెంట్‌లలో కట్టాలని చెప్తే కడతామని చెప్పామని తల్లిదండ్రులు చెబుతున్నారు. సెలవుల తర్వాత తమ కుమారుడు కాలేజీకి వచ్చాడని, తర్వాత క్లాసులో కాసేపు ఉన్నాక ఎందుకు దూకి చనిపోయాడో కారణాలు తెలుసుకోవాలని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు” అని వెంకటేశులు చెప్పారు.

పిల్లలను అర్థం చేసుకోండి

ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని ముందుగానే కనిపెట్టవచ్చని సైకాలజిస్టులు అంటున్నారు.

”ఫీజు కట్టలేదని కాలేజీలో జరిగే అవమానాలు కావచ్చు, పరీక్షల ఒత్తిడి కావచ్చు, మరేదైానా కావచ్చు, పిల్లల్లో అనుమానాస్పదమైన వైఖరి కనిపించినపుడు ముందుగా గుర్తించగలిగితే ఆత్మహత్యలు నివారించవచ్చు” అని సైకాలజిస్టు కిరణ్ కుమార్ అంటున్నారు.

”పిల్లలు సైలెంటుగా ఉండడం, తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండడం. నిరుత్సాహంగా ఉండడం లాంటివి చేస్తుంటారు. అలాంటి లక్షణాలను గమనించిన వెంటనే వారిని సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాలి. అలా చేసి ఉంటే ఈ అబ్బాయి చనిపోయే ఉండేవాడు కాదు” అని కిరణ్ కుమార్ అన్నారు.

నారాయణ కళాశాలలో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం ఇది మొదటిసారి కాదు. నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలల్లో పిల్లలపై ఉండే ఒత్తిడి దాని పర్యవసానాల గురించి గతంలో చాలామంది మాట్లాడి ఉన్నారు.

ముఖ్య గమనిక..

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000