రాగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మిల్లేట్స్‌లో రాగులు కూడా ఒక భాగం. రాగులను పూర్వం నుంచి ఆహారంగా తీసుకుంటున్నారు. రాగుల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రాగులను పిండిని ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. రాగి పిండిని ఉపయోగించడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. ఈ రాగి పిండితో ఎంతో ఆరోగ్యకరమైన సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్, మైదా పిండితో తయారు చేసే సూప్ కంటే రాగి పిండితో చేసే సూప్ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా రుచిగా ఉంటుంది. ఈ సూప్ తయారు చేయడానికి కూడా ఎంతో సమయం పట్టదు. మరి ఈ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి వెజ్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి, వెల్లుల్లి తరుగు, బటర్ లేదా నెయ్యి, ఉల్లిపాయ, మీకు నచ్చిన వెజిటేబుల్స్, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, పంచదార.
రాగి వెజ్ సూప్ తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. అందులో బటర్ లేదా నెయ్యి వేయండి. బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి తరుగు వేసి ఒకసారి వేయించాక.. ఉల్లి తరుగు వేసి కలపండి. ఆ నెక్ట్స్ క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.
ఇవి మెత్తగా అయ్యాక ఇందులో నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ నీటిని ఓ పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసి చిక్కగా అయ్యేంత వరకు దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి. చివరగా కొద్దిగా వెనిగర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాగి సూప్ సిద్ధం.