ఉదయమైనా, సాయంత్రమైనా.. పగలైనా, రాత్రైనా చిరాగ్గా ఉంటే కప్పు టీ తాగితే చాలు. మనసుకి హాయిగా ఉంటుంది. నిద్రలేవగానే మన పని మొదలవ్వాలన్నా.. ఇంట్లో వాళ్లలో పొద్దున్నే చురుకు పుట్టించాలన్నా.. వెంటనే గుర్తొచ్చేది టీనే! ఇలా చెప్పుకుంటూ పోతే టీ మన రోజు వారీ జీవితంలో ఎన్నో విధాలుగా ముడిపడి ఉందని చెప్పవచ్చు. అందుకే చాలా ఇళ్లలో టీ లేకుండా రోజు ప్రారంభం కాదు. కొందరైతే రోజంతా టీ తాగకుండానే ఉంటారు. అయితే, టీకి- క్యాన్సర్‌కు మధ్య సంబంధం ఉందని మీకు తెలుసా? చాలా చోట్ల టీ తయారు చేసేటప్పుడు కలర్ మిక్స్ చేస్తారు. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి సంఘటన ఇటీవల కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలో విషపూరిత పద్ధతులను ఉపయోగించి టీ ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు.
కర్ణాటకలో పలుచోట్ల టీ నమూనాలను సేకరించి, ల్యాబ్‌లో టెస్ట్ చేయగా.. అందులో 71 శాంపిల్స్‌లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అదే రాష్ట్రంలో కాలీఫ్లవర్, మంచూరియన్, పీచు మిఠాయి వంటి వాటిల్లో ఉపయోగంచే రంగుల మీద కూడా FSSAI షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ రంగులు అత్యంత విషపూరితమైనవని, వీటివల్ల క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వంటి రోగాలువచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది.
కర్ణాటకలోని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారి ఇటీవల ఓ కారులో దొరికిన టీ ఆకుల నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్‌లో టెస్ట్ చేయగా అందులో దుమ్ము, పురుగుమందులు, రంగులు కనుగొనబడ్డాయి. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. ఉత్తర కర్ణాటక నుంచి దాదాపు 50 శాంపిల్స్ తీసుకోగా టీ ఆకుల తయారీలో పెద్ద మొత్తంలో పురుగుమందులు వాడినట్లు తేలిందని చెప్పారు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోడమైన్-బి, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు తేయాకు ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఇది ప్రమాదకర సంకేతం.
నిపుణులు ఏమంటున్నారు?
టీ ప్రాసెసింగ్ సమయంలో రోడమైన్ బి, కార్మోసన్ ఫుడ్ కలర్స్ కలుపుతారని ఢిల్లీలోని ధర్మశాల ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అంగ్షుమన్ చెప్పారు. ఈ రకమైన టీ తాగడం వల్ల శరీరంలో జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వినియోగం క్యాన్సర్‌కు కారణం కావచ్చు. రోడమైన్ బి అనేది క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం. అలాగే చాలా మంది పాలతో చేసిన టీని ఇష్టపడతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కానీ ప్రతిరోజూ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఖాళీ కడుపుతో పాల టీ తాగడం వల్ల జీవక్రియ బలహీనపడుతుంది. దీనిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ, ఇతర పొట్ట సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే టీలో కెఫీన్ ఉంటుంది. ఇది రాత్రిపూట మన నిద్ర వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలేమి కలుగుతుంది.