ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం పలు అంశాలకు అంగీకారం తెలిపింది.
దీని ప్రకారం.. ఎస్‌జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహిస్తారు. హైస్కూళ్లలో 49 రోల్ దాటిన తరువాత 2వ సెక్షన్ ఏర్పాటు చేస్తారు. అలాగే, ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తారు.
హై స్కూళ్లలో ఉండే ప్రాథమిక పాఠశాలలను విడిగా నిర్వహిస్తారు. పని భారం ఎక్కువయ్యే సందర్భంలో ఆయా సబ్జెక్టులకు అవసరం మేరకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్/సర్ప్లస్ టీచర్లను సర్దుబాటు చేస్తారు. స్టడీ లీవ్‌లో ఉన్న టీచర్లు ఆగస్టు 2025లోపు చేరేవారి స్థానాలను బదిలీలలో ఖాళీగా చూపరు.
ప్రస్తుత బదిలీలలో బ్లాకింగ్ ఉండదు. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 1382 పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులు కల్పిస్తారు. రెండు సార్లు రీ అపోర్షన్మెంట్ కి గురయ్యే టీచర్లకు 7 పాయింట్లు ఇస్తారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు చేస్తారు. బదిలీల తర్వాత ఎంఈవో, హెడ్ మాస్టర్ల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటారు.
మోడల్ ప్రైమరీ స్కూళ్లలో స్టూండెట్స్ సంఖ్య 120 దాటినపుడు పీఎస్‌హెచ్‌ఎం అదనంగా (1+5) కేటాయిస్తారు. పలు పెండింగ్ అంశాలు కూడా ఉన్నాయి. సమాంతర మాధ్యమం విషయాన్ని విద్యాశాఖ మంత్రితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటారు. ఈ వివరాలను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తెలిపింది.