Food adulteration: ఆహార కల్తీలో టాప్‌లో తెలంగాణ,ఆంధ్ర

ఒకవైపు వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారుతున్న తరుణంలో, మరోవైపు ఆహార పదార్థాల్లో కల్తీ ముప్పు తీవ్రంగా పెరుగుతోంది. ఈ రెండు సమస్యల మధ్య సామాన్య ప్రజలు చిక్కుకుని జీవన గుణనాన్ని కోల్పోతున్నారు.


ముఖ్యంగా ఆహార పదార్థాల్లో కల్తీ కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు నిత్య జీవితంలో ప్రభావం చూపుతున్నాయి.

కల్తీకి గురవుతున్న ఆహార పదార్థాలు

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న నూనె, కారం పొడి, పసుపు, బియ్యం, పిండి పదార్థాలు, మసాలా పౌడర్లు మొదలైన వాటిలో ఎక్కువ శాతం కల్తీ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వినియోగించే పదార్థాలు నాణ్యతా ప్రమాణాలకు చాలా దూరంగా ఉంటున్నాయి. ఒకవైపు ధరల పెరుగుదల, మరోవైపు లాభాపేక్ష – ఇవే కల్తీకి కారణాలుగా మారాయి. మిగిలిపోయిన, గడువు ముగిసిన పదార్థాలను పునరుత్పత్తి చేసి, కొత్త ప్యాక్‌లో విక్రయించడమూ తరచుగా కనిపిస్తున్న ఘటనలుగా మారాయి. పట్టణాలు, మహానగరాల్లో బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్లు బాగా పెరిగిపోయాయి. వీటిలో ఎక్కువ శాతం కల్తీ పదార్థాల వినియోగమే కనిపిస్తోంది. ఇంట్లో వంటకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్లు నుండి రాత్రి భోజనం వరకు బయటే తినే వారు సంఖ్యాపరంగా పెరిగిపోతుండటంతో కల్తీ ఆహారానికి అడ్డు లేకుండా పోతోంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, మందు సేవించే వారి విషయంలో ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో అనే కనీస అవగాహన లేకుండా కల్తీ పదార్థాలు శరీరంలోకి చేరిపోతున్నాయి. దీని ప్రభావం నెమ్మదిగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ నివేదికలు

2021-24 మధ్య కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీగా తేలినట్టు వెల్లడించింది. ఇది అత్యంత ఆందోళనకర విషయం. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది. తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. 14 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. ఇక ఆ తర్వాత 13.11 శాతంతో కేరళ 9 శాతంతో ఆంధ్రప్రదేశ్ 6.30 శాతంతో కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కల్తీ ఆహార పదార్థాలు తిన్న వెంటనే కొన్ని సమస్యలు, కాలక్రమేణా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిలో ముఖ్యమైనవి పౌష్టికాహార లోపం- కల్తీ పదార్థాలు అసలు పోషక విలువలు కలిగి ఉండవు. దీని వల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడి బలహీనత వస్తుంది. నానా రకాల కల్తీ కెమికల్స్ వల్ల వెంటనే వాంతులు, జ్వరాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు- శరీరంలోనికి చేరిన కల్తీ పదార్థాలు కాలక్రమేణా లివర్, కిడ్నీ, మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. కొన్ని రసాయనాలు క్యాన్సర్ కు కారణమవుతాయి. కల్తీ ఆహార సమస్యను చిన్నగా తీసుకోవడానికి వీల్లేదు. ఇది లక్షలాది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది.