నేడు పూర్తి స్థాయి చర్చలు
కనీసం 2.. గరిష్ఠంగా 4 పదవులు
రామ్మోహన్‌నాయుడికి మెరుగైన అవకాశాలు
ఎస్సీల నుంచి గెలిచిన ముగ్గురిలో ఒకరికి ఛాన్స్!
జనసేనకు అవకాశం వస్తే బాలశౌరికి చోటు
తెలుగుదేశం కేంద్ర మంత్రివర్గంలో చేరనుంది. కనీసం రెండు నుంచి గరిష్ఠంగా నాలుగు స్థానాలు తెదేపా సభ్యులకు లభించే అవకాశముందని పార్టీ వర్గాల కథనం. తాజా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయేలో.. భాజపా తరువాత తెదేపాకే అత్యధికంగా 16 స్థానాలు లభించాయి. దిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే భేటీకి హాజరైన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును కేంద్ర మంత్రివర్గంలో తెదేపా కూడా భాగస్వామి కావాలని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. అప్పటికప్పుడే అంగీకరించినట్లు సమాచారం. రెండు క్యాబినెట్ మంత్రి పదవులు, మరో రెండు సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీయే నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి దిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. మంత్రి పదవులు, శాఖల గురించి శుక్రవారం భాజపా అగ్రనేతలతో చర్చించనున్నారు. ఈ నెల 9న మోదీతోపాటే తెదేపా సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.
బీసీల నుంచి కింజరాపు వారసుడి పేరు!
తెదేపా నుంచి లోక్‌సభకు గెలుపొందిన వారిలో బలహీనవర్గాలకు చెందిన వారు అత్యధికంగా ఆరుగురున్నారు. వీరిలో వరుసగా మూడోసారి గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మరణం తరువాత రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన పార్థసారథి సీనియర్ అయినప్పటికీ రామ్మోహన్‌నాయుడి వైపే మొగ్గు కనిపిస్తోంది.
ప్రసాదరావుకే కాస్త మొగ్గు
ఎస్సీ వర్గం నుంచి తెదేపా ఎంపీలుగా గెలిచిన ముగ్గురూ తొలిసారి ఎన్నికైనవారే. వీరిలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ చంద్రబాబుకు సన్నిహితుడు, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు. కిందటి ఎన్నికల్లో ఓడిపోయిన హరీష్… ఈసారి విజయం సాధించారు. మిగిలిన ఇద్దరు పదవీవిరమణ చేసిన ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ (బాపట్ల), విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి ప్రసాదరావు (చిత్తూరు). వివిధ సమీకరణాలతోపాటు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాదరావు వైపు కొంత మొగ్గు ఉండొచ్చన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది.
రెండు ప్రధాన వర్గాల నుంచి నలుగురి పోటీ
మిగిలిన రెండు ప్రధాన వర్గాల్లో గుంటూరు, నరసరావుపేటల నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు నుంచి ఒకరు, నెల్లూరు, నంద్యాలల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బైరెడ్డి శబరిల నుంచి మరొకరిని పరిశీలించే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు కాకున్నా.. డిప్యూటీ స్పీకర్ వంటి పదవి తీసుకోవాల్సి వచ్చినా సమీకరణాలు కొంత మారతాయి.
జనసేన, భాజపాల నుంచి..
ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన నుంచి ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా గెలిచారు. వారిలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. మూడోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు అవకాశమిస్తే సహజంగానే బాలశౌరి పేరు పరిశీలనకు వస్తుంది. భాజపా నుంచి ముగ్గురు గెలుపొందగా వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన కేంద్ర మాజీ మంత్రి, గతంలో లోక్‌సభకు రెండుసార్లు ఎన్నికైన పురందేశ్వరి (రాజమహేంద్రవరం), రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేష్ (అనకాపల్లి) పేర్లు పరిశీలనలో ఉంటాయి.