తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, బస్సుల్లో రద్దీ పెంచుకునేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రత్యేక పర్వదినాల్లో ఉండే రష్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉంటుంది ఆర్టీసీ. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగా సర్వీసులు నడుపుతోంది. ఈ క్రమంలో తాజాగా టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఇకపై నేరుగా ఇంటి వద్దకే ఆ సేవలు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఆ వివరాలు..
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంతేకాక ప్రయాణిలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూనే.. ఆదాయంపైనా ఆర్టీసీ దృష్టి సారించింది. ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ గతంలోనే కార్గో సర్వీసులను తీసుకొచ్చింది. కార్గో, పార్సిల్ సేవల ద్వారా వస్తువులను ఒక చోటు నుంచి మరో చోటుకు తక్కువ ధరలో పంపిస్తుంది. అయితే తాజాగా ఈ కార్గో సేవలను మరింత బలోపేతం చేయటంపై ఆర్టీసీ దృష్టి సారించింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరించాలని.. ఆ సంస్థ యాజమాన్యానికి సూచించింది. ప్రస్తుతం ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలు ముఖ్యమైన బస్టాండ్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ రవాణా మంత్రి శాఖ.. ఆర్టీసీ ఆదాయ మార్గాలు, స్థితిగతులపై ఇటీవల సమీక్షించి ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిలో భాగంగానే.. ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు కార్గో సేవలను విస్తరించాలని సూచించారు.
దీనిలో భాగంగా ఇకపై కేవలం బస్టాండుల్లో మాత్రమే కాకుండా.. ప్రైవేటు పార్సిల్ సర్వీసుల మాదిరిగా ఇంటి నుంచి ఇంటి వరకు కూడా కార్గో సేవలు అందించేలా లాజిస్టిక్ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా యాజమాన్యానికి సూచించారు. ఈ మేరకు ఇళ్ల వద్ద బుకింగ్ తీసుకుని.. వచ్చిన పార్సిళ్లను తిరిగి ఇళ్ల దగ్గరకు చేరవేసేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త కార్గో సేవల ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో కొలిక్కి రానుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కొత్త తరహా కార్గో సేవల్లో రిటైర్మెంట్ తీసుకున్న ఆర్టీసీ మాజీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్ని భాగస్వాములుగా చేయాలని మంత్రి పొన్నం సూచించారు. అలా చేయటం ద్వారా.. ప్రజలకు మెరుగైన సేవలతో పాటు.. వారికి కూడా ఆదాయం కల్పించినట్లు అవుతుందని తెలిపారు. అలాగే తెలంగాణ ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న సగటు వార్షికాదాయం రూ.4,500 కోట్ల కాగా.. త్వరలోనే దాన్ని రూ.8,500 కోట్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా 90 పైచిలుకు బస్ డిపోలు, 40 వేల మందికి పైగా ఉద్యోగుల నెట్‌వర్క్ ఉందన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీసం వెయ్యి పాయింట్ల ద్వారా డోర్ టూ డోర్ కార్గో, పార్సిల్ సేవలు ప్రారంభించాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. తొలుత ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించి.. తర్వాత మిగిలిన ప్రధాన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న కార్గో సేవల సాఫ్ట్‌వేర్ రూపకల్పన జరుగుతోందని వివరించారు. ఇక ఇది అమల్లోకి వస్తే.. ప్రజలకు కార్గో సేవలు మరింత చౌకగా అందనున్నాయి అంటున్నారు.