సాధారణంగా పాములకు చాలా దూరంగా ఉంటాం. అందులోనూ నాగుపాములు అంటే మరి భయం. అవి మన పరిసరాల్లోకి, ఇంట్లోకి ప్రవేశిస్తే.. అక్కడ్నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తాం.
కానీ ఈ గ్రామస్థులు మాత్రం.. నాగుపాములతో కలిసి నివసిస్తున్నారు. నాగుపాములను తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్రామం నాగుపాములకు పుట్టినిల్లుగా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ నాగుపాములు దర్శనమిస్తాయి. మరి ఆ గ్రామం ఎక్కడుందంటే.. మన ఇండియాలోని మహారాష్ట్రలో.
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని స్థానికులు పాముల భూమి, పాముల దేవస్థానం అని పిలుస్తారు. మన దేశంలో నాగుపాములను పరమ శివునితో సమానంగా చూస్తారు. కాబట్టి ఆ గ్రామంలో నాగుపాములను ఎంతో గౌరవంగా చూసుకుంటూ, తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. నాగుపాములను నిత్యం పూజిస్తూ.. వాటితో సహజీనవం చేస్తున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ, వాస్తవం.
నాగుపాములకు భయపడరు..
విషపూరితమైన ఈ నాగుపాములకు షెట్పాల్ గ్రామప్రజలు అసలు భయపడరు. వాటి మధ్యనే స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ప్రతి ఇంట్లో పాములకు దేవస్థానం అనే ప్రత్యేక ప్రాంతం కూడా ఉంటుంది. స్థానికులు ఎవరైనా సొంతిల్లు నిర్మించుకున్నప్పుడు పాములు నివసించేందుకు, అవి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఒక గదిలాంటి నిర్మాణాన్ని నిర్మిస్తారు. ఇక ఆ ప్రాంతంలోనే పాములు ఉంటాయి. పాములు కూడా మనషులకు భయపడవు. పిల్లలు నాగుపాములతో కలిసి మెలిసి ఉంటారు. 2,600 మంది ప్రజలు నివసిస్తున్న ఆ గ్రామంలో నాగపంచమి రోజు సందడిగా ఉంటుంది. ఆ రోజున ఇతర గ్రామాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు. పాములకు పూజలు చేసి దైవానుగ్రహం పొందుతారు.