మా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి తప్పే- మాజీ మంత్రి బొత్స హాట్ కామెంట్స్

Botcha Satyanarayana : ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారాయన.


”టీడీపీ నాయకులు వైసీపీ పార్టీ ఆఫీసులకి వెళ్లి సందర్శిస్తున్నారు. ప్రైవేట్ ఆస్తిలోకి టీడీపీ నాయకులు రావడం తగదు. ప్రజలు ఎన్నుకున్న నేతలే వ్యవస్థల్లోకి వెళ్లి హంగామా చేయకూడదు. అలాంటి ఘటనలు జగరకుండా చూడాలని కోరుకుంటున్నా. పార్టీ ఆఫీసులు, యూనివర్శిటీల వీసీలపై జరుగుతున్న ఘటనలు దురదృష్టం. మా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి తప్పే. ఇంటర్నల్ మీటింగ్స్ లో అలాంటి పనులు చేయొద్దని సూచించాం.

యూనివర్శిటీ వీసీలను ఎంపిక చేసేది గవర్నర్. ద్రవిడ యూనివర్శిటీలో తప్పులు జరిగితే వీసీపై నేనే చర్యలు తీసుకున్నా. నాపై వస్తున్న ఆరోపణలపై నేను స్పందించను. ఫైల్స్ అన్నీ విద్యాశాఖలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చు. కొందరు రిటైర్డ్ అధికారులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు వారికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డీఎస్సీ పోస్టులు 6 వేలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 16 వేల పోస్టులు ఎలా భర్తీ చేస్తుందో నాకు తెలియడం లేదు” అని బొత్స సత్యనారాయణ అన్నారు.