బరువు తగ్గించే బెస్ట్ బ్రేక్‌ ఫాస్ట్..ప్రోటీన్ రిచ్ మఖానా సూప్

బరువు తగ్గాలనే ప్రయాణంలో చాలామందికి ఎదురయ్యే పెద్ద సవాలు ఆహారం. రోజూ తినే చప్పగా ఉండే సలాడ్లు, ఉడకబెట్టిన కూరగాయలు నాలుకకు రుచిని దూరం చేస్తాయి. దీంతో డైట్ అంటేనే ఒకరకమైన విసుగు వస్తోందా? అయితే మీ డైట్‌ ను బోర్‌ గా మార్చకుండా, దానికి రుచిని, ఆరోగ్యాన్ని జోడించే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే ప్రోటీన్ రిచ్ మఖానా సూప్.


ఫూల్ మఖానాలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సూప్‌ ను ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. అంతేకాదు ఇది రోజంతా మిమ్మల్ని చురుకుగా, ఉత్సాహంగా ఉంచుతుంది.

కావాల్సిన పదార్థాలు
మఖానా – 1 కప్పు
బొంబాయి రవ్వ- అర కప్పు
నెయ్యి – 3 టీస్పూన్లు
వేరుశనగలు – పావు కప్పు
బాదం, జీడిపప్పు – ఒక్కొక్కటి 10
బంగాళాదుంప – 1
టమోటా – 1
పచ్చిమిర్చి – 2-3
అల్లం – చిన్న ముక్క
జీలకర్ర – 1 టీస్పూన్
మిరియాలు – అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
కరివేపాకు – ఒక రెబ్బ
నిమ్మరసం – 1 టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – 3 కప్పులు

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టండి.

-తర్వాత స్టవ్‌ పై పాన్ పెట్టి మిరియాలు, అర టీస్పూన్ టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి, చల్లారాక మెత్తని పొడిగా దంచి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు పాన్‌ లో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక వేరుశనగలు, బాదం, జీడిపప్పులను ఒకదాని తర్వాత ఒకటిగా వేయించి ఒక ప్లేట్‌ లోకి తీసుకోండి.

-అదే పాన్‌ లో మిగిలిన నెయ్యిలో మఖానాలను కూడా వేసి రెండు నిమిషాలు కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు సూప్ కోసం స్టవ్‌ పై మరో పెద్ద పాన్ పెట్టి 2 టీస్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక మిగిలిన అర టీస్పూన్ జీలకర్ర, తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అవి చక్కటి సువాసన వస్తున్నప్పుడు తరిగిన బంగాళాదుంప ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు చల్లి రెండు నిమిషాలు మగ్గనివ్వండి.

-ఇప్పుడు అందులో నానబెట్టిన రవ్వను నీటితో సహా వేసి ఉండలు కట్టకుండా కలపాలి. వెంటనే 3 కప్పుల నీళ్లు, పసుపు, టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి 5 నిమిషాలు మీడియం మంటపై ఉడికించండి. సూప్ కొద్దిగా చిక్కబడి, బంగాళాదుంపలు మెత్తగా ఉడికిపోతాయి.

-సూప్ సిద్ధమయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న మఖానా, నట్స్ వేసి కలపాలి.

-చివరగా మనం సిద్ధం చేసుకున్న మిరియాలు జీలకర్ర పొడి, నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే.. వేడివేడిగా, ఘుమఘుమలాడే ప్రోటీన్ రిచ్ మఖానా సూప్ రెడీ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.