వైఎస్ జగన్ నొక్కిన బటన్లు అబద్ధం

ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ ఏమైంది.? ఆరోగ్యశ్రీకి ఎందుకు బకాయిలు పడ్డాయ్.? రోడ్లెందుకు గుంతలతో ప్రజల ప్రాణాల్ని తీశాయ్.? వాలంటీర్ల వల్ల ఉపయోగమేంటి.?


అసలంటూ వైఎస్ జగన్ నొక్కిన బటన్లు, వాటికి సంబంధించిన సొమ్ములు ఏమైపోయాయ్.?

సంక్రాంతి పండగ నేపథ్యంలో, ఊరూవాడా ఇదే చర్చ. కూటమి హయాంలో గ్రామాభివృద్ధి పరుగులు పెడుతోంది ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా. ఎక్కడా బటన్ నొక్కుడు వ్యవహారాల్లేవ్.. అసలంటూ పబ్లిసిటీ స్టంట్లే లేవు. కానీ, గతంలో అలా కాదు. ఎటు చూసినా పబ్లిసిటీ స్టంట్లే.!

వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయల్ని ‘గుంతల రోడ్లను బాగు చేయడం కోసం’ కేటాయించినట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంది, ఎడా పెడా ప్రచారం చేసుకుంది. కానీ, వందల రూపాయల ఖర్చుతో పూర్తయ్యే రిపేర్లు కూడా రోడ్లకు జరగని వైనం జనానికి కళ్ళ ముందు కనిపించింది.

నాడు – నేడు.. అంటూ ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేసినట్లు వైసీపీ చెప్పుకుంటే, ఎన్నికల సమయంలో అవే స్కూళ్ళలో ఓట్లేసిన జనం, అక్కడి సౌకర్యాల లేమి చూసి, స్కూళ్ళ దుస్థితి చూసి, వైసీపీని ఛీకొట్టి వచ్చారు.

సంక్రాంతి పండగ సందర్భంగా రచ్చబండల దగ్గర ఎక్కువగా ఇవే చర్చలు జరుగుతున్నాయ్. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం కూడా ఇవ్వకుండా ఈవీఎం ప్రభుత్వమనీ, అవినీతి అనీ.. ఏవేవో ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తుండడంపైనా జనం గుస్సా అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కూటమి ప్రభుత్వంలో బూతుల మంత్రులు లేరు.. బూతుల ప్రెస్ మీట్లు అసలే లేవు. బూతుల బహిరంగ సభలూ లేవన్న మాట సంక్రాంతి వేళ జనాల చర్చల్లో ఎక్కువగా వినిపించడం గమనార్హం.

విజయవాడలో సంభవించిన వరదలు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చేసిన సాయం, ప్రభుత్వ పరంగా అందిన చేయూత గురించి కూడా జనం చర్చించుకుంటున్నారు. అదే సమయంలో, వైఎస్ జగన్ ప్రకటించిన కోటి ఎక్కడికి పోయిందన్న ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది.

ప్రధానంగా, వైసీపీ హయాంలో వైఎస్ జగన్ నొక్కిన బటన్లు, తద్వారా దుర్వినియోగమైన ప్రజాధనం లెక్కలు తీయాలంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిన దోపిడీ లెక్కలూ బయటపెట్టాలని ప్రభుత్వంపై జనం ఒత్తిడి తెస్తున్నారు.