పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ

www.mannamweb.com


పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలపగా.. రాజధాని అమరావతి రైతులు సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ‘‘త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. 15 రోజుల్లో అధ్యయనం చేసి టౌమ్‌బౌండ్‌ నిర్ణయిస్తాం. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తాం. రాజధాని తొలి దశ పనులకు రూ.48 వేల కోట్లు ఖర్చవుతాయి. మూడు దశల్లో రూ. లక్ష కోట్ల ఖర్చు అవుతుంది. రాజధానిలో రోడ్లు ధ్వంసం, చోరీలపై చర్యలు తీసుకుంటాం. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తాం’’ అని తెలిపారు.

త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం..
రాబోయే 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సమీక్ష అన్న క్యాంటీన్లపైనే చేసినట్టు చెప్పారు. భోజన సరఫరా బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. గతంలో చేసుకున్న ఒప్పందం, జీవోలను పరిశీలిస్తున్నామన్నారు. మూడు వారాల్లో ప్రారంభానికి సిద్ధమని ఫౌండేషన్‌ తెలిపిందన్నారు. అన్న క్యాంటీన్లలో గత ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసిందని, సచివాలయాలను ఇతర భవనాల్లోకి మార్చాలని ఆదేశించామన్నారు.

గతంలో మాదిరిగానే రూ.5కే అల్పాహారం, భోజనం అందిస్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక నేతలు, రాజధాని ఐకాస సభ్యులు పువ్వాడ సుధాకర్‌తో సమావేశమయ్యారు. రాజధానిలో గడిచిన ఐదేళ్లుగా కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడ్డారని మంత్రి అన్నారు. దీనిపై ఒక కమిటీని నియమిస్తామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.