ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర గా పేరుగాంచిన సమ్మక్క – సారలమ్మ జాతర 2026 లో జరగబోయే తేదీలను పూజారుల సంఘం ఖరారు చేసింది.
పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్ రావు నేతృత్వంలో సంఘ సభ్యులు సమావేశమై మహా జాతర జరగబోయే తేదీలను ప్రకటించారు. 2026 జనవరి 28 బుధవారం సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు గద్దెకు విచ్చేసి, గోవింద రాజు, పగిడిద్ద రాజులు గద్దెలకు చేరుకుంటారు.
2026 జనవరి 29 గురువారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు. 2026 జనవరి 30 శుక్రవారం భక్తులు తమ మొక్కుబడులను సమర్పించుకునే ప్రత్యేక దినంగా ఉంటుంది. 2026 జనవరి 31 శనివారం సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లు వనప్రవేశం తో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుందని పూజారులు తెలిపారు. పూజారుల సంఘం చేసిన ప్రకటన ప్రకారం అధికారికంగా జాతర నిర్వహణాధికారులు పరిశీలించి సమీక్షించనున్నారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విచ్చేస్తారు. దీంతో ఏర్పాట్ల విషయంలో ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం అవుతుంది.































