దేశీయ టెలికాం కంపెనీలు కస్టమర్లకు షాక్ ఇవ్వనున్నాయి. సుమారు రెండేళ్ల తర్వాత మొబైల్ టరిఫ్ ధరలను 15 శాతం పెంచే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది.
ఈ పెంపు ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టెలికాం ఆదాయ వృద్ధి రేటును రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈక్విటీ విశ్లేషకులు అక్షత్ అగర్వాల్, ఈక్విటీ అసోసియేట్ ఆయుష్ బన్సల్ రూపొందించిన జెఫరీస్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రథామర్థంలో జియో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ రంగం విలువను పెంచడంతో పాటు, మొబైల్ సేవల ధరలు పెరిగేందుకు దోహదపడుతుంది. చివరి టారిఫ్ పెంపు తర్వాత రెండేళ్లకు, అంటే 2026, జూన్‌లో మొబైల్ టారిఫ్‌లు పెరుగుతాయని మేము భావిస్తున్నామని గురువారం నివేదిక విడుదల సందర్భంగా విశ్లేషకులు తెలిపారు. పెరుగుతున్న డేటా, పోస్ట్‌పెయిడ్ వినియోగం, అలాగే డేటా వాడకం అధికం కావడం వంటివి టారిఫ్ పెంపులతో పాటు దేశంలో మొబైల్ ఆర్పు (సగటు వినియోగదారు ఆదాయం)ను పెంచుతున్నాయని నివేదిక తెలిపిది.
ఇదే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 16 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాం. 2026 క్యాలెండర్ ఏడాదిలో టారిఫ్ పెంపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, ఆర్పు 14 శాతంతో మెరుగైన వార్షిక వృద్ధికి వీలుంది. టారిఫ్ పెంపు ప్రభావం కారణంగా కొత్త సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్షీణించవచ్చని కూడా నివేదిక పేర్కొంది. అంచనా ప్రకారం, జియో తన విలువను భారతీ ఎయిర్‌టెల్‌కు దగ్గరగా చేర్చేందుకు, పెట్టుబడిదారులకు రెండంకెల స్థాయిలో రాబడి అందించడానికి మొబైల్ టారిఫ్‌లో 10-20 శాతం పెంచవచ్చు. ఇక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా తన చట్టబద్ధమైన బకాయిలను తీర్చడానికి 2027-2030 మధ్య మొబైల్ సేవల ధరలను 45 శాతం పెంచాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది.
































