ప్రపంచం మెచ్చిన మన ప్రాంతీయ స్వీట్స్‌ ఇవే

భారతదేశం అనేక శతాబ్దాలుగా విభిన్న వంటకాలకు పేరొందింది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన మిఠాయిలకు కూడా మనం కేరాఫ్‌గా ఉన్నాం. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇప్పుడు ఆయా వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు సైతం లభిస్తోంది.


దాంతో వీటికి నకిలీలు పుట్టుకురాకుండా పలు స్వీట్స్‌కు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జిఐ) ట్యాగ్‌ ఇచ్చారు. ఈ ట్యాగ్‌ ప్రత్యేక ప్రాంతానికి చెందిన, అక్కడి పద్ధతుల్లో తయారయ్యే సంప్రదాయ మిఠాయిలను పరిరక్షించడంతో పాటు గ్లోబల్‌ స్థాయిలో మరింత గుర్తింపును ఈ ట్యాగ్‌ తెచ్చిపెడుతుంది.

మన తిరుపతి లడ్డూ గొప్పతనం తెలిసిందే. అవి కాకుండా ప్రస్తుతం అలాంటి గుర్తింపు పొందిన గ్లోబల్‌ స్వీట్స్‌.. వాటి మూలాల గురించి తెలుసుకోవాలంటే… దార్వాడ్‌ పేడ, కర్ణాటక రాష్ట్రపు సంప్రదాయ స్వీట్‌. చిక్కటి పాలతో దీని తయారీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఎర్రనిరంగులో ఉండే ఉత్తరప్రదేశ్‌ బనారస్‌ లాల్‌ పేడకు ఆ రంగు రావడానికి కారణం వండే శైలి అట. వారణాసి మూలాలు కలిగిన ఈ స్వీట్‌ పాలపిండి, పప్పులు, సీడ్స్‌ మేలు కలయిక.

ఇక మనకూ బాగా పరిచయమైన బెంగాల్‌ రసగుల్లా కూడా జిఐ ట్యాగ్‌ అందుకుంది. చక్కెర పాకంలో ముంచిన సున్నితంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్‌. పశ్చిమ బెంగాల్‌కి చెందింది. అలాగే ఒడిశాకు చెందిన మరో రకం రసగుల్లాకి కూడా జిఐ ట్యాగ్‌ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాను ప్రపంచ పటంలో నిలబెట్టిన ”పేపర్‌ స్వీట్‌” ఇప్పుడు అంతర్జాతీయంగా ఆకర్షిస్తోంది.

ఈ ఆత్రేయపురం పూత రేకులు కూడా జిఐ ట్యాగ్‌ను పొందాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన బందరు లడ్డు.. కూడా ఈ గుర్తింపును అందుకుంది. కొబ్బరిపాలు, గుడ్లు తదితరాలను మేళశించి చేసే గోవన్‌ బెబింకా అనే గోవా స్వీట్‌ 16 పొరలతో తీయటి అనుభూతులు పంచుతూ ప్రపంచవ్యాప్త గుర్తింపునూ జిఐ ట్యాగ్‌ను దక్కించుకుంది.

గోధుమ పిండి, నెయ్యి, బెల్లంతో తయారయ్యే తమిళనాడుకు చెందిన తిరునల్వేలి హల్వాకు కూడా జిఐ గుర్తింపు ఉంది. ఇక కేరళకు వెళ్లే పర్యాటకులు తప్పకుండా రుచి చూసేది, తమతో పాటు వెంట తెచ్చుకునే కోజికోడ్‌ హల్వా గురించి మనలో చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు అది ప్రపంచానికి కూడా తెలిసింది.

గుమ్మడి గింజలతో తయారయ్యే పేత ఆగ్రా ప్రాంతపు వంటకంగా ప్రపంచ ప్రాచుర్యం పొందింది. తాజ్‌మహల్‌ని సందర్శించేవారు చవులూరించే పేతను కూడా రుచిచూడందే వదలరు. బీహార్‌కు చెందిన సిలావో కాజా… ఇలా డజనకు పైగా జిఐ ట్యాగ్‌ పొందిన భారతీయ మిఠాయిలు ఉన్నాయి. వీటిని రుచి చూడడం అంటే కేవలం మరో వెరైటీ వంటకాన్ని తినడం మాత్రమే కాదు ఆయా ప్రాంతపు సంప్రదాయాల్ని అవగాహన చేసుకోవడం కూడా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.