ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే

భారత్‌లో డయాబెటిక్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మరోవైపు, ఫ్యాటీ లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం వైద్యులను ఆందోళనకు గురి చేస్తోంది.


20ల్లో, 30ల్లో ఉన్న వారు కూడా లివర్ వ్యాధుల బారిన పడుతుండటం మరో ఆందోళనకారక అంశం. అయితే, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఎన్ఏఎఫ్ఎల్‌డీ) వ్యాధి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే ముప్పును ముందుగానే నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మద్యపానం అలవాటు లేని వారిలో లివర్‌లో కొవ్వు పేరుకోవడాన్ని ఎన్ఏఎఫ్ఎల్‌డీ అని అంటారు. ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్‌ఫ్లమేషన్ కూడా మొదలయ్యి చివరకు లివర్ సిర్రోస్ లేదా ఫెయిల్యూర్‌కు దారి తీసే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి కొన్ని రకాల ఫుడ్స్ చాలా మేలు చేస్తాయి. వ్యాధి నియంత్రణలో ఉండేలా చేస్తాయి.

రెగ్యులర్‌గా కాఫీ తాగే వారిలో ఎన్ఏఎఫ్ఎల్‌డీ ముప్పు తగ్గుతుంది. ఎన్‌జైమ్‌ స్థాయిలు అసాధరణంగా మారకుండా కాఫీ నిరోధిస్తుంది. స్కారింగ్ ముప్పును తగ్గిస్తుంది.

వెల్లుల్లి కూడా లివర్ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఇది లివర్‌లోని కొవ్వును సులువుగా కరిగిస్తుంది. క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.

ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చేపలు కూడా లివర్‌ ఆరోగ్యానికి కీలకం. ఇవి కాలేయంలోని కొవ్వు, ఇతర ట్రైగ్లిజరైడ్స్‌ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ద్రాక్షలోని అనేక రసాయనాలు లివర్‌కు మేలు చేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌, కొవ్వు నిల్వలు తగ్గిపోయేలా చేస్తాయి.

ఇక యాంటిఆక్సిడెంట్స్, అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న నట్స్‌ కూడా లివర్‌కు పూర్తి రక్షణ ఇస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి ఫ్యాటీ లివర్ రాకుండా నిరోధిస్తాయి.

పాలీఫిలాన్స్ అనే రసాయనాలు సమృద్ధిగా ఉన్న బ్లూబెర్రీలు, క్రాన్‌బెర్రీలు, రాస్బెర్రిలు కూడా లివర్‌కు రక్షణ కవచంలా పనిచేస్తాయి. లివర్‌ గాయాలు తగ్గిస్తాయి. బ్లూబెర్రీలు రెగ్యులర్‌గా తింటే లివర్ ఫైబ్రోసిస్ ముప్పు తగ్గినట్టు ఓ అధ్యయనంలో స్పష్టంగా కనిపించింది. లివర్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులతో ఎన్ఏఎఫ్ఎల్‌డీ ముప్పు చాలా వరకూ తగ్గిపోతుందని భరోసా ఇస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.