అనుకోని ఖర్చులు వెంటాడుతున్నాయా?
ఎంత సంపాదించినా చేతిలో పైసా నిలవడం లేదా?
ఎలాంటి లోనట్టే కనిపిస్తున్నా సమయానికి చేతిలో డబ్బు ఉండడం లేదా?
ఆదాయం పెరుగుతున్నా కానీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదరువుతోందా?
ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారా?
ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకునేవారికోసం కొన్ని టిప్స్ సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు…అవేంటంటే..
మంగళవారం నియమం
ఎవర్ని కదిలించినా సంతోషంగా ఉన్నాం అనేకన్నా ఏదో ఉన్నాంలే అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంటుంది. ఆ భారం దించుకునేందు ఆధ్యాత్మిక వేత్తలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన నియమాల్లో మొదటిది మంగళవారం నియమం. మంగళవారం ఏ పని చేసినా మళ్లీ చేస్తారని చెబుతారు. చాలామందికి ఈ నమ్మకం ఉంది కూడా. అందుకే మీకు అప్పులేమైనా ఉంటే మంగళవారం రోజు ఎంతో కొంత తీర్చాలని సూచిస్తున్నారు. ఓ మంగళవారం అప్పు తీరిస్తే త్వరలోనే అప్పుల ఊబినుంచి బయటపడతారని చెబుతున్నారు. ఓ మంగళవారం అప్పులు తీర్చేస్తే ఆ తర్వాత ఏదో ఒకరకంగా మీచేతికి డబ్బు చేరుతుందట. మీరు ఊహించనంత త్వరగా అప్పు తీర్చేయగలుగుతారు. ఇది కేవలం మంగళవారానికి మాత్రమే ప్రత్యేకత అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ సెంటిమెంట్ కొత్తగా మొదలైనదేం కాదు పూర్వకాలం నుంచి కొనసాగుతోందట. ప్రతి మంగళవారం ఎంతో కొంత అప్పు తీర్చుకుంటూ వెళితే క్రమంగా అప్పులు ఐస్ క్రీమ్ లా కరిగిపోతాయట. అయితే మంగళవారం అప్పులు తీర్చండి కానీ ఎవరికీ అప్పులు ఇవ్వకండి.
శుక్రవార నిమయం
శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు. అందుకే శుక్రవారం రోజు తలకు సాధారణ స్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోరాదు. ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం రోజు తల రుద్దుకోకూడదు. ప్రతిశుక్రవారం ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని, లక్ష్మీకటాక్షం ఉంటుందని చెబుతారు. చేతికి బంగారం గాజులు లేదంటే మట్టిగాజులు వేసుకోవాలి కానీ ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ముఖ్యంగా వివాహితులు ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
జుట్టు విరబోసుకుని తిరగొద్దు
జుట్టు విరబోసుకుని తిరగడం అంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే. అందుకే ఎప్పుడూ జుట్టు విరబోసుకుని తిరగకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా శుక్రవారం రోజు జుట్టు విరబోసుకోవడం, పేలు చూసుకోవడం అంటే ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తున్నట్టే.. లక్ష్మీదేవిని సాగనంపుతున్నట్టే.
శుక్రవారం రోజు ఇవి ఇవ్వకండి
పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు..వీటిని లక్ష్మీదేవికి చిహ్నాలుగా భావిస్తారు. అందుకే శుక్రవారం రోజు వీటిని ఎవరికీ ఇవ్వకూడదని చెబుతారు.
అబద్ధాలు చెప్పొద్దు
గృహిణి లక్ష్మీదేవితో సమానం..అందుకే గృహలక్ష్మి అంటారు. ఇంటికి మంచి జరగాలని కోరుకోవాలి కానీ అశుభం పలకకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక పుస్తకాల్లో పొందుపరిచిన వివరాలు ఆధారంగా రాసిన కథనం. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
































