ఇది ఆంధ్ర వాతావరణ నివేదిక.. రాబోయే 2 రోజులు ఎలా ఉండబోతుందో.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల మధ్య మాటలు మంటలు రాజేస్తుంటే.. మరోవైపు వెదర్ చాలా కూల్‌గా మారిపోయింది. వాతావరణాన్ని వానావరణం ఆవరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో చూద్దాం. ఆ వివరాలు..

ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ద్రోణి ఇప్పుడు పశ్చిమ-మధ్య అరేబియా సముద్రం నుండి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతుందని తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం (14-06-25) రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


ఆదివారం(15-06-25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంది. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 50మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగల 48. 5మిమీ, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 44.5మిమీ, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురం 40.5మిమీ, నంద్యాల జిల్లా చౌతకూరులో 32.7మిమీ చొప్పున వర్షపాతం రికార్డైంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.