ఏపీలో త్వరలో జరుగనున్న మెగా డిఎస్సీకి 3లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 30మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో తన నియోజక వర్గంలో నిరుద్యోగుల కోసం మంత్రి రామానాయుడు సొంతంగా మూడు నెలలుగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
ఏపీ మెగా డిఎస్సీ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంది. 16వేల పోస్టులకు మూడు లక్షల మంది దరఖాస్తు చేశారు. డీఎస్సీ పరీక్షకు హాజరవ్వటం, దానికి ప్రిపేర్ అవటం, విజేతలు కావటం అభ్యర్థుల ముందున్న అసలైన సవాళ్లు. ఈ క్రమంలో నియోజక వర్గంలో నిరుద్యోగుల కోసం పాలకొల్లులో మంత్రి నిమ్మల సొంత నిధులతో శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు.
డిఎస్సీలో ఉద్యోగాన్ని సాధించడానికి నిరుద్యోగులు అష్ట కష్టాలు పడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందడం, వంటి కనిపించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నియోజక వర్గంలో అందరికీ శిక్షణ
మంత్రి వద్దకు వెళ్లి శిక్షణకు సిఫార్సు కోరిన ఉపాధ్యాయ ఉద్యోగార్ధుల 10- 12 మంది ఉంటే పాలకొల్లు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎంతమంది డీఎస్సీ పరీక్షకు హాజరవుతారో ఆరా తీశారు. సుమారు 800 మంది వరకు అభ్యర్థులు ఉంటారని తెలియడంతో అందరికీ శిక్షణ ఇప్పించాలని భావించారు.
విజయవాడ నుంచి అవనిగడ్డ ప్రగతి శిక్షణ సంస్థకు వెళ్లి స్థానికంగా ఉన్న పరిస్థితలని వివరించి పాలకొల్లులో ప్రగతి ఆధ్వర్యంలో డీఎస్సీ శిక్షణ కేంద్రం పెట్టాలని, అందుకు స్థానికంగా అయ్యే ఖర్చుల్ని ధర్మారావు ఫౌండేషన్ భరిస్తుందని వారికి చెప్పి ఒప్పించారు.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం పాలకొల్లులో ఉచిత డీఎస్సీ శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేశారు. నియోజకవర్గం మొత్తం మీద 800 మంది దీనిలో శిక్షణ పొందారు.
సొంత ఖర్చులతో ఏర్పాట్లు…
ఉచిత డీఎస్సీ శిక్షణ శిబిరం కోసం దాదాపు రూ.50లక్షలు ఖర్చు చేశారు. స్థానిక బిఆర్‌ఎం వి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శిక్షణకు ఏర్పాట్లు చేశారు. కోచింగ్ నిర్వహణకు ప్రత్యేకమైన షెడ్డును ఏర్పాటు చేసి ఫ్యాన్లు, లైట్లు, దోమతెరలు వంటి సౌకర్యాలు కల్పించారు. పాఠశాల భవనంలో ప్రత్యేక తరగతులను ఏర్పాటుచేసి అక్కడ సౌకర్యాలు కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతుల నిర్వహణకు వచ్చే అభ్యర్థులకు ఏటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
తరగతుల నిర్వహణకు సంబంధించి నాలుగు రోజులు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, మరో మూడు రోజులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్నాయి. సబ్జెక్టులు వారీగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించారు. అవనిగడ్డ ప్రగతి కోచింగ్ నిర్వాహకులు పూర్ణ ఆధ్వర్యంలో అధ్యాపకులు, హైదరాబాదు, విశాఖపట్నం చెందిన అధ్యాపకులు, స్థానిక అధ్యాపకులు డిఎస్సీ అభ్యర్థులకు సిలబస్ బోధించారు.
అభ్యర్థులందరికీ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు రూ.15 లక్షల విలువైన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేశారు. రోజువారి పరీక్షలు, ప్రతివారం గ్రాండ్ టెస్ట్‌లను నిర్వహిస్తూ వచ్చారు.
శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజన సదుపాయం కల్పించారు. వారంలో మూడు రోజులు పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ జరిగిన సమయాల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేశారు.
డీఎస్సీ పరీక్షల అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమం నేటితో ముగియనుంది. శిక్షణ పొందిన 800 మంది అభ్యర్థులు మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు చెబుతున్నారు