పాకిస్తాన్ మూడు ముక్కలుగా మారే టైం వచ్చిందా.. పీవోకే బాటలో అడుగులేస్తున్న ఆ ప్రాంతాలు ఏంటి?

www.mannamweb.com


Pakistan: చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చింది ఆ దేశం.

అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది. అవి కాస్తా సొంతంగా ఉగ్రవాదమనే భూతాన్ని సృష్టించాయి. దాన్ని ఉసి గొలిపి.. జిహాద్ పేరిట విధ్వంసాన్ని పాక్‌ సృష్టించింది. కానీ, చేసిన పాపం ఊరికేపోదు కదా.. ఇప్పుడు పీవోకే రూపంలో తాను తవ్వుకున్న గోతిలోనే తానే పడుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్‌ను విడగొట్టా లని పగటి కలలు కన్న పాకిస్తానే తానే ముక్కలుగా మారేందుకు సిద్ధమైంది. ఎందుకంటే, ఇస్లామాబాద్ ఎదుర్కొంటున్న సమస్య పీవోకే ఒక్కటే కాదు.. మరో రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్‌తో తెగదెంపులకు సిద్ధమవుతున్నాయి. ఇంతకూ, పీవోకే బాటలో అడుగులేస్తున్న ఆ రెండు ప్రాంతాలు ఏంటి? పాకిస్తాన్ నిజంగా మూడు ముక్కలు కాబోతోందా?

అది 1971. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛకోసం పోరాడి స్వతంత్రం సంపాదించుకుంది. బంగ్లాదేశ్‌గా అవతరించింది. పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్‌గా మిగిలిపోయింది. ఇది ఆ దేశ చరిత్రలోనే ఓ పీడ కలగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్‌లో అలాంటి పరిస్థితే వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు రెండు ముక్కలుగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు మూడు ము క్కలుగా మారబోతోందేమో అన్నట్టుగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఇస్లామాబాద్‌పై తిరగబడ్డారు. షరీఫ్ సర్కార్ కాళ్ల బేరానికొచ్చినా కనికరించడంలేదు. స్వేచ్ఛ ఒక్కటే సొల్యూషన్ అని తేల్చి చెబుతున్నారు.

అయితే, పాకిస్తాన్‌కు అసలు సమస్య పీవోకే ఒక్కటే కాదు. నిజానికి.. పీవోకే ఆందోళనల కంటే ముందే పశ్చిమ, దక్షిణ పాకిస్తాన్‌లోని పెద్ద మొత్తంలో భూభాగాలపై ఇస్లామాబాద్ నియంత్రణ కోల్పోయింది. ఆ ప్రాంతాలను తెహ్రీక్ ఈ-తాలిబన్ పాకిస్తాన్ సొంతం చేసుకుంది. దీనంతటికీ కారణం ఇస్లామాబాద్‌ చేసుకున్న స్వయం కృతాపరాధమే. రెండు దశాబ్దాల క్రితం పాక్‌కు చెందిన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో టీటీపీ భూతాన్ని సృష్టించింది. 2001 నుంచి 2021 నాటికి అది పెరిగి పెద్దయ్యింది. ఇప్పుడు తనను సృష్టించిన పాకిస్తాన్‌నే అది కబళిస్తోంది. ప్రస్తుతం ఆ ఉగ్ర సంస్థనే పాకిస్తాన్‌లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది. ఆ దేశ సార్వభౌ మత్వాన్నే సవాల్ చేస్తోంది. పాక్‌ను ముక్కలుగా చేసేందుకు యత్నిస్తోంది. 1971 నాటికి పరిస్థితులను మళ్లీ పునరావృతం చేసేందుకు సిద్ధమైంది.

పాకిస్తాన్‌లో నాలుగు రాష్ట్రాలు పంజాబ్‌, సింధ్‌, బలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫఖ్తుంఖ్వాలు ఉన్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో రెండు ప్రాంతాలు ముజఫరాబాద్‌, గిల్గిట్-బాల్టిస్థాన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక పంజాబ్‌ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది. ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన అస్థిత్వాన్నే కోల్పోయే ప్రమాదముంది. పాక్‌లో పంజాబ్‌ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు 40 శాతం. అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరులను దోచి పెట్టి పంజాబ్‌కు ఇస్తున్నారనే వాదన ఉంది. సైన్యం, దేశ పాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా పాకిస్తాన్‌లో వేర్పాటువాదం బలపడింది. అది ఏ స్థాయిలో ఉందీ అంటే పాకిస్తాన్‌లో రక్తపాతం సృష్టిస్తున్న మెజారిటీ దాడులకు బలూచీ వేర్పాటు వాదులే కారణం.

నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్‌తో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బ్రిటిషు పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం. పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్‌ను 1948లో తనలో కలుపుకుంది. అప్పటి నుంచి అక్కడి బలూచ్ ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచ్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం. తమకు ఎదురుతిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది. ఏ ప్రాంతం అయినా అణచివేతలను కొంత వరకే భరించగలుగుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు మొదలవు తుంది.

ఆ నాడు బంగ్లాదేశ్‌లో జరిగింది కూడా అదే. ఇప్పుడు బలూచిస్తాన్‌లోనే అదే జరుగుతోంది. ఎప్పు డైతే పాకిస్తాన్ అణచివేతలు తీవ్రమయ్యాయో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురుతిరగడం మొదలుపెట్టారు. ఈ గ్రూపు చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్‌లోని గ్యాస్‌, ఖనిజ వనరులను చైనా, పాక్‌ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా ఇక్కడి గ్వాదర్‌ పోర్ట్‌, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపధ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

బలూచ్ తర్వాత ఆజాదీ కోరుకుంటున్న మరో ప్రాంతం సింధ్. బ్రిటిష్ వారు తమ ఆక్రమించిన సింధూ రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్ లో కలిపారు. ఆనాడు మొగ్గ తొడిగిన పోరాటం యాభై ఏళ్లుగా వృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విభజన అనంతరం లక్షలాదిమంది ముహజర్లు భారత్‌ నుంచి సింధ్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరిని పంజాబీ పాలకులు చిన్నచూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలన్న ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక సింధ్‌ ప్రజల నుంచి ఈ డిమాండ్‌కు పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. దేశానికి జీవనాడైన కరాచీ రేవు ఈ రాష్ట్రంలోనే ఉంది.

వాస్తవానికి.. సింధు దేశ్ పోరాటం ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. జాఫర్ సాహితో లాంటి నాయకులు అమెరికా లాంటి దేశాల్లో సింధ్ దేశ్ గురించి ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పటి వరకూ సుమారు 60 మంది సింధ్ దేశ్ కీలక నేతలను హతమార్చింది. వేల మందిని జైళ్లలో నిర్బంధించింది. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సింధ్ దేశ్ పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. బలుచిస్తాన్ పోరాటంతో పోల్చి చూస్తే సింధ్ దేశ్ పోరాటానికి ప్రజల మద్దతు తక్కువగానే ఉన్నప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల తిరుగుబాటు సింధ్ ప్రజల ఆలోచనను కూడా మార్చేస్తోంది.

బలూచిస్తాన్, సింధ్ తర్వాత ఇస్లామాబాద్ నుంచి విముక్తి కురుకుంటున్న మరో ప్రాంతం ఖైబర్ ఫఖ్తుంఖ్వా. పాక్‌లోని వాయువ్య రాష్ట్రం అయిన ఖైబర్‌ ఫఖ్తుంఖ్వాలో ఫస్తూన్‌ జాతీయవాదం బలంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ వీరిసంఖ్య మెజార్టీగా ఉంది. రెండు దేశాల మధ్య డ్యూరండ్‌ రేఖ ఉన్నా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. ఆఫ్ఘాన్ వాసులు ఎక్కువగా వస్తున్నారన్న కారణంతో పాక్‌ సైన్యం తరచూ సరిహద్దును మూసివేస్తోంది. దీనిపై ఫస్తూన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఆఫ్ఘాన్ ను ఆనుకొని ఉండటంతో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు. తాలిబన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం.

ఇక ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వీరందరికీ ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతు లభిస్తోంది. గతంలో పాక్ ఇంటీరియల్ మంత్రి రాణా సనావుల్లా మిలిటరీ యాక్షన్‌పై కామెంట్స్ చేశారు. దీనికి ప్రతిగా తాలిబాన్లు 1971లో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫోటోను షేర్ చేశారు తాలిబాన్లు. మరోసారి మిలిటరీ యాక్షన్.. అంటే 1971 సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఖైబర్ ప్రాంతంలో ఇటీవల భద్రతా బలగాలపై దాడులు అధికం అయ్యాయి. దీనికితోడు ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం నడుస్తోంది. దీంతో ఆఫ్ఘన్ తాలిబాన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు.

నిజానికి ఈ పరిస్థితులన్నింటికీ కారణం పాకిస్తానే. భారత్‌ నుంచి కశ్మీర్‌ను విడదీయాలనే కుట్రలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హెచ్‌యూఎం వంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించి భారత్‌లో విధ్వంసానికి కుట్రలు చేసింది. అలాంటి వాటిలో ఇప్పుడు పాకిస్తాన్‌పైనే తిరగబడుతున్న టీటీపీ కూడా ఉంది. గతేడాది ఇదే సమయంలో టీటీపీ.. పాకిస్తాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది. కేబినెట్ ఏర్పాటు చేసి మంత్రులను కూడా నియమించింది. రక్షణ, విద్య, న్యాయ, సాంకేతిక, నిఘా, ఆర్థిక, రాజకీయ సంబంధాలతో పాటు నిర్మాణ శాఖను కూడా ఏర్పాటు చేస్తూ ఫత్వా జారీ చేసింది.

తమ ఆధ్వర్యంలో ఉన్న భూభాగాలను టీటీపీ రెండుగా విభజించింది. నార్త్‌జోన్ కింద పెషావర్, మలకాండ్, గిల్గిట్-బాల్టిస్తాన్, మర్డాన్.. సౌత్ జోన్ కింద డేరా ఇస్మాయిల్ ఖాన్, బన్ను, కొహాట్ ప్రాంతాలను చేర్చింది. ఆయా ప్రాంతాలు తాత్కాలికంగా పాకిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఇస్లామాబాద్ అధికారం ఓ కలగానే మారింది. అక్కడితో ఆగని టీటీపీ ఇస్లామాబాద్‌పైకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ అత్యవసర సమావేశాలు నిర్వహించి.. టీటీపీ శిబిరాలు, నెట్‌వర్క్‌ను నాశనం చేయాలని నిర్ణయించింది. కానీ, అవేవీ వర్క్‌ఔట్ కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అందుకు నిధుల్లేవ్. ఈ పరిస్థితులే పాకిస్తాన్‌ను ముక్కలు చెక్కలు చేయబోతున్నాయి.