ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యమైనది. రాత్రిపూట తగినంత నిద్ర ఉంటేనే ఆ మర్నాడు మంచి శక్తితో మేల్కోని రోజంతా చురుగ్గా ఉంటారు. కానీ,నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.
నిద్రకోసం వారు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. వైద్యుల సలహా మేరకు కొందరు మందులు కూడా వాడుతుంటారు. కానీ, ఇవేవీ లేకుండా ప్రశాంతమైన నిద్రను పొందాలనుకుంటే.. కొన్ని సింపుల్ టిప్స్ పాటించవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం…
ప్రశాంతమైన నిద్రకోసం ముఖ్యంగా రాత్రి సమయంలో అతిగా భోజనం చేయకూడదు అంటున్నారు నిపుణులు. బదులుగా సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.. నిద్రకు రెండు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించాలని సూచిస్తున్నారు. టీవీ, ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటితో రాత్రి వేళ ఎక్కువ సమయం గడపకూడదు..ఇలా చేయటం వలన ఫోన్ నుంచి విడుదలయ్యే నీలి రంగు కాంతి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. నిద్రకు సిద్ధమయ్యే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం కూడా మంచిది. పాలలో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినో యాసిడ్ శరీరంలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చక్కగా నిద్రపడుతుంది.
రాత్రి సమయంలో టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, కేక్స్ తీసుకోకూడదు. వీటిలో ఉండే షుగర్, కెఫిన్లు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. రోజువారీ వ్యాయామం ద్వారా నిద్రలేమి లక్షణాలను నియంత్రించవచ్చు. రోజూ తగినంత వ్యాయామం చాలా ముఖ్యం. ప్రశాంతమైన గాఢ నిద్ర, ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందడానికి ఉదయం వ్యాయామం చేయాలి. నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం కేటాయించి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)