Spiritual: 2025 సంవత్సరం మొత్తం అదృష్టం కలిసే రావాలంటే జనవరి 1న ఈ పని చేయాల్సిందే!

మరో మూడు రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. 2025 మొదలుకానుంది. అయితే కొత్త ఏడాది రోజు ఏడాది మొత్తం బాగుండాలని మంచి జరగాలని ఆలయాలకు వెళ్తూ ఉంటారు.


అందరు సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్తే మరి కొందరు పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు. అలాగే జనవరి 1వ తేదీన ముఖ్యంగా కొన్ని రకాల దేవాలయాలను సందర్శిస్తే వ్యాపార అభివృద్ధితో పాటుగా విద్యా ఉద్యోగం వ్యాపార రంగాల్లో మంచి పురోగతి ఉంటుందని చెబుతున్నారు. మరి అందుకోసం జనవరి 1న ఎలాంటి ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని.. బుధవారానికి బుధుడు అధిపతి అని మాచిరాజు చెబుతున్నారు. బుధగ్రహానికి కూడా ఇద్దరు అధిష్ఠాన దేవతలు ఉన్నారు. అందులో ఒకరు గణపతి, మరొకరు విష్ణుమూర్తి. కాబట్టి జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజు గణపతి ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయాలను దర్శించుకోవాలని చెబుతున్నారు. అయితే గణపతి ఆలయానికి వెళ్లిన వారు పాటించాల్సిన విధివిధానాల విషయానికొస్తే.. ​గణపతి ఆలయంలో చేయాల్సిన పనులు ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఆ రోజున గణపతికి అభిషేకం చేయాలట. అలాగే గరిక, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలని చెబుతున్నారు. అలాగే విగ్నేశ్వరుడి ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయాలట. దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించమని చెబుతున్నారు.

వీటిలో ఏది చేసినా బుధుడి అనుగ్రహంతో పాటు గణపతి ఆశీస్సులు లభిస్తాయని తద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలో సంవత్సరం మొత్తం అద్భుతంగా రాణించవచ్చని చెబుతున్నారు. విష్ణుమూర్తి ఆలయంలో పాటించాల్సిన విధివిధానాల విషయానికొస్తే.. జనవరి 1వ తేదీన అందుబాటులో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లినా మంచిదేనట. విష్ణుమూర్తి ఆలయం అంటే శ్రీరాముడు, కృష్ణుడు, నరసింహ స్వామి, వేంకటేశ్వర స్వామి ఇలా విష్ణు రూపానికి సంబంధమైన ఆలయాలను దర్శించుకోవచ్చని అంటున్నారు. విష్ణుమూర్తి ఆలయంలో చేయాల్సిన పనులు ఏంటంటే.. ఆలయంలో కుటుంబ సభ్యుల పేరుతో అర్చన చేయించుకోవాలని చెబుతున్నారు. అలాగే విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఆలయంలో ప్రదక్షిణలు చేయమని కూడా చెబుతున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాన్ని వెలిగించాలట. ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.