సినీ పరిశ్రమలోకి ఎంటర్ అవ్వడం అమ్మాయిలకు సేఫ్ కాదని, వారిపై ఎలాగైనా అడ్వాంటేజ్ తీసుకుంటారని చాలామంది ప్రేక్షకులు అంటుంటారు. ఇక చాలామంది హీరోయిన్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తమకు ఎదురైన చేదు అనుభవాలను అందరితో పంచుకున్నారు.
ఇలా ఎన్ని జరిగినా కూడా ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. అమ్మాయిలకు అవకాశాలు ఇస్తామని చెప్పి వారిపై లైంగికంగా దాడి చేయడం ఆగడం లేదు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడానికి నిందితుడిపై కేసు నమోదు చేశారు. కానీ ఈ వార్త చూసిన ప్రేక్షకుల్లో భయం మొదలయ్యింది.
కేసు నమోదు
సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ఎదురుచూస్తున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. మామూలుగా క్రిమినల్స్‌కు ఇలాంటి అమ్మాయిలే టార్గెట్. తాజాగా అలాంటి మహిళలకు సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి, ఆడిషన్స్ పేరుతో గదికి పిలిచి వారిపై లైంగికంగా దాడి చేశాడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అందులో నుండి ఒక మహిళ ఫిర్యాదు చేయడం వల్ల ఈ అసిస్టెంట్ డైరెక్టర్ భాగోతం బయటికొచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు.. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌పై కేసు నమోదు చేశారు. అలా తను గతంలో మహిళలకు చేసిన అన్యాయాలు గురించి కూడా బయటపడ్డాయి. అలా అసిస్టెంట్ డైరెక్టర్ కాటేకొండ రాజు గుట్టురట్టయ్యింది.
మహిళపై లైంగిక దాడి
మామూలుగా క్యాస్టింగ్ కౌచ్ అనే పేరుతో చాలామంది హీరోయిన్లు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కునే ఉంటారు. ప్రతీ ఒక్కరు ఇలాంటివి ఎదుర్కున్నా కూడా బయటికి చెప్పడానికి మాత్రం భయపడతారు. తాజాగా జరిగిన అసిస్టెంట్ డైరెక్టర్ ఘటన విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ (32) భర్తతో విడిపోయి మణికొండలో హౌస్ కీపింగ్ పని కోసం వచ్చింది. మణికొండలో హౌస్ కీపింగ్ పని చేస్తూ 15 రోజుల క్రితమే అమీర్‌పేట్‌లో ఒక హాస్టల్‌లో జాయిన్ అయ్యింది. సినిమాలంటే ఆ మహిళకు ఇష్టం కావడంతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరడానికి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకుంది. ఇదే క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది.
మూడు రోజుల క్రితం ఆడిషన్స్ ఉన్నాయంటూ కృష్ణానగర్‌లోని హెవెన్ హోటల్‌కు ఆమెను పిలిపించాడు కాటేకొండ రాజు. మొదటి రోజు ఫోటోషూట్ చేసి మరుసటి రోజు మళ్లీ అదే చోటికి రావాలని చెప్పి ఆ మహిళను అక్కడి నుండి పంపించేశాడు. అది నమ్మి రెండో రోజు కూడా అదే హోటలర్ రూమ్‌కు వెళ్లింది ఆ మహిళ. ఆ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీ ఎన్ ఎస్ 64,79,115,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం బయటికి రావడంతో ఆ మహిళకు న్యాయం చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు.