డీఎస్సీ హాల్‌ టికెట్లు చూసి గుడ్లు తేలేస్తున్న నిరుద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి తాజాగా హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షలు జూన్‌ 6 నుంచి జూన్ 30 వరకు నిర్వహించనున్నారు.


అయితే అభ్యర్ధులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత.. వాటిని చూసి ఖంగుతింటున్నారు. మూడు, నాలుగు పరీక్షలకు ఫీజు చెల్లించిన వారికి ఒక్కో పరీక్షను హైదరాబాద్‌తో సహా ఏపీలోని వివిధ నగరాల్లో కేటాయించారు. దీంతో ఏ పరీక్షకు ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. సాధారణంగా అభ్యర్ధులు దరఖాస్తు సమయంలో పరీక్ష కేంద్రాల ఎంపికకు ఇచ్చిన తొలి సెంటర్‌నే కేటాయించడం జరుగుతుంది. కానీ మెగా డీఎస్సీలో మాత్రం ఇచ్చిన ఎంపికల్లో రెండు, మూడు ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని హాల్‌ టికెట్లు జారీ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్న ఓ అభ్యర్ధి తొలి ఎంపిక హైదరాబాద్‌, రెండో ఎంపిక ఏపీలోని ప్రకాశం జిల్లా పెట్టుకుంటే.. ఒక పరీక్ష హైదరాబాద్‌లో, రెండో పరీక్ష ప్రకాశం జిల్లా కేటాయించారు. నిజానికి పరీక్ష కేంద్రాల ఎంపికలో టెట్‌లోనూ ఇలాంటి ఎంపికలే ఇచ్చినప్పటికీ అన్ని పరీక్షలకు హైదరాబాద్‌ సెంటర్‌నే విద్యాశాఖ కేటాయించింది. కానీ మెగా డీఎస్సీలో ఇలా ఒక్కో పరీక్ష కేంద్రం ఒక్కో జిల్లాకు కేటాయించడంతో తికమక పడుతున్నారు. పరీక్షల ప్రిపరేషన్ సమయంలో అభ్యర్ధులను పరీక్ష సెంటర్ల టెన్షన్‌ గందరగోళంలో పడేసింది. దీంతో పరీక్షలకు సక్రమంగి సిద్ధం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరికైతే ఒకే రోజు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించారు. దీంతో పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకునేదెలా? అంటూ తలలు పట్టుకుంటున్నారు. కొందరికి ఏకంగా 500 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల ఆవల పరీక్ష కేంద్రాలను కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే సమయం ఇవ్వకుండా ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరో పరీక్ష పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. అభ్యర్ధులకు ఒకే జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించాలని, అలాగే వెంట వెంటనే పరీక్షలు నిర్వహించకుండా ప్రిపరేషన్‌కు కనీస గడువు ఇవ్వాలని అభ్యర్ధులు మొరపెడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బెహర చక్రధరరావు డీఎస్సీకి అర్హత ఉన్న ఎస్‌ఏ (ఎన్‌ఎల్‌), ఫిజికల్‌ డైరెక్టర్, ఫిజికల్‌ డైరెక్టర్‌ స్కూల్‌ అసిస్టెంట్, పీఈటీ వీహెచ్, పీఈటీ మొత్తం నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అందులో రెండు పోస్టులకు ఒకే రోజు, ఒకే సెషన్, ఒకే సమయానికి హాజరుకావాలని ఉండటంతో ఖంగుతిన్నాడు. నాలుగు పరీక్షలకు రుసుం కట్టానని, హాల్‌ టికెట్‌ చూస్తే మూడు పరీక్షలు మాత్రమే రాయగలుగుతానని చక్రధరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.