ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 54 రోజుల సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అందిస్తుంది. ఇదే వ్యాలిడిటీ ప్లాన్‌ల కోసం ఇతర ప్రైవేటు టెలికం కంపెనీలలో అయ్యే ఖర్చులో దాదాపు సగం ఖర్చుతోనే బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
బీఎస్ఎన్ఎల్ 54 రోజుల ప్లాన్ కీలక ఫీచర్లు
బీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.347కే లభిస్తున్న ఈ ప్లాన్ లో అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉచిత నేషనల్ రోమింగ్ తో సహా భారతదేశంలోని ఏ నంబర్ కు అయినా అపరిమిత వాయిస్ కాల్స్ ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.
ఈ ప్లాన్ రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 54 రోజుల వ్యాలిడిటీ కాలంలో మొత్తం 108 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతోపాటు ఈ ప్లాన్‌లో బైటీవీకి (BITV) కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఉంది. ఇందులో 400కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.
ఈ కొత్త ప్లాన్‌తో పాటు తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రయత్నాలతో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతోంది. తమ వినియోగదారులకు మరింత విలువ ఆధారిత సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది.
బీఎస్ఎన్ఎల్ ఇటీవల 75,000 కొత్త 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. రాబోయే వారాల్లో 100,000 కొత్త 4జీ టవర్ల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.