Chhaava Movie Review: ఛావా మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. సింహంలా గర్జించిన వికీ కౌశల్.. రష్మిక పెర్ఫార్మెన్స్ ఎలా

నటీనటులు: వికీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ కుమార్, అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటి, వినీత్ కుమార్ సింగ్ తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ నిర్మాతలు: దినేశ్ విజన్ సినిమాటోగ్రఫి: సౌరభ్ గోస్వామి ఎడిటింగ్: మనీష్ ప్రధాన్ మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్ బ్యానర్: మడోక్ ఫిల్మ్స్ రిలీజ్ డేట్: 2025-02-14


దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకొంటాడు. అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను సంభాజీ తిప్పి విజయవంతంగా తిప్పికొడుతాడు. సంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి సంభాజీ మహారాజ్‌పై యుద్ధం ప్రకటిస్తారు. ఔరంగజేబ్‌ (అక్షయ్ ఖన్నా)కు నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు.

స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ, సంభాజీ ఎలాంటి సాహసాలు ప్రదర్శించారు. మరాఠా ప్రజల కోసం ఎలాంటి సుభిక్ష పాలన చేశారు? తండ్రి శివాజీ అడుగు జాడల్లో నడుస్తూ స్వరాజ్య స్థాపనకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎలాంటి యుద్ధ వ్యూహాలు రచించాడు. అత్యంత బలమైన మొఘల్ సేనలను సంభాజీ మహారాజ్ ఎలా ఎదురించాడు? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి యేసుభాయి ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాట నైపుణ్యం, మరాఠా పౌరుషాన్ని ఎలా ప్రదర్శించాడనే సినిమా కథ. దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ ఎంచుకొన్న కథ, దానికి తగినట్టుగా రాసుకొన్న స్క్రీన్ ప్లేతోనే సినిమా విజయాన్ని రుచి చూసిందని చెప్పవచ్చు. దర్శకుడు విజన్ ప్రకారం కథను యుద్ధంతో మొదలుపెట్టి హై యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. తొలి సీన్ నుంచే యాక్షన్, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్‌తో సినిమాను మరింత భావోద్వేగంగా మలిచాడు. తొలి భాగంలో ఎమోషన్స్, పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్ పూర్తిగా డామినేట్ చేశాయనే చెప్పాలి.

ఛావా సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే… పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్బుతంగా తెరకెక్కించారు. ఇండియన్ స్క్రీన్ పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చి దిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాలపాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సంభాజీ మహారాజ్, అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెల్లగక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వికీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రతీ సన్నివేశంలో పౌరుషంగా, పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ సినిమా కోసం తన లుక్‌ను అద్బుతంగా డిజైన్ చేసుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక సినిమా చివరి 45 నిమిషాలపాటు స్క్రీన్ పైనుంచి కను రెప్పలు వాల్చకుండా చూసేలా తన నటనను ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో సింహంలా గర్జించాడు. యుద్ద సన్నివేశాల్లో మొఘల్ సేనలపై పులి దూకడం ఆయన టాలెంట్ ఏమిటో మరోసారి రుచి చూపించాడు.

ఇక సంభాజీ భార్యగా రష్మిక మందన్న మరోసారి పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. హైలీ ఎమోషనల్ క్యారెక్టర్‌లో జీవించారనే చెప్పాలి. ఆమె ఫెర్ఫార్మెన్స్ నేషనల్ క్రష్ ట్యాగ్‌ను మించి ఉందనే చెప్పాలి. ఇక ఔరంగజేబ్ కూతురు జీనత్ ఉన్నీసా బేగంగా డయానా పెంటీ తన కళ్లతోని.. క్రూరమైన హావభావాలను ప్రదర్శించి ఆకట్టుకొన్నది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా మరోసారి అత్యంత భారమైన పాత్రలో మెప్పించాడు. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు ఆ పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకొని జీవించారనే ఫీలింగ్ కల్పించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ అందించిన మ్యూజిక్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పౌరుషాన్ని రగిలించే పాటలు సినిమాకు అత్యంత బలంగా నిలిచాయి. సౌరభ్ గోస్వామి అందించిన సినిమాటోగ్రఫి సినిమాను హాలీవుడ్ మూవీని మించి ఉందనే ఫీలింగ్ కల్పించింది. మడోక్ బ్యానర్, దినేష్ విజన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఛావా చిత్రం ఓవరాల్‌గా దేశభక్తిని చాటిచెప్పే ఎమోషనల్ వార్ డ్రామా. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ పార్ట్ అత్యున్నత అంశాలుగా మారాయి. అలాగే మరాఠా యోధులు స్వరాజ్య స్థాపన కోసం ఎలాంటి త్యాగాలకు ఒడిగట్టారనే విషయాన్ని చాలా భావోద్వేగంగా చెప్పారు. చరిత్రను తెలుసుకొనే వారు, అలాగే మొఘల్ పాలనలో అరాచకాలను గ్రహించాలనుకొంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి. వికీ కౌశల్, రష్మిక మందన్న తమ నటనతో ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమాను థియేటర్‌లోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. డొంట్ మిస్ ఇట్.