రాజధాని అమరావతిలో విజయవాడ, గుంటూరు కలిసిపోతాయి

రాజధాని అమరావతిలో విజయవాడ, గుంటూరు నగరాలు క్రమంగా కలిసిపోయే వీలున్నందున ఇప్పటి నుంచే వాటి సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


పట్టణీకరణ కూడా పెరగనున్నందున ఔటర్‌ రింగ్‌రోడ్డు వెలుపల ప్రాంతంలో ప్రజల భవిష్యత్‌ అవసరాలకు వీలుగా బృహత్తర ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి కన్నబాబు ప్రజంటేషన్‌ ఇచ్చాక చంద్రబాబు మాట్లాడారు. ‘రాష్ట్రంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణం మెరుగయ్యేలా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర] కార్యక్రమం నిర్వహించాలి. త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తాం. దీన్నో ఉద్యమంలా ముందుకు తీసుకెళదాం’ అని అధికారులను సీఎం ఆదేశించారు.

‘అన్న క్యాంటీన్లకు సలహా కమిటీలు ఏర్పాటు చేయాలి. దాతలను సమీకరించడం, క్యాంటీన్ల ద్వారా పేదలకు ఇంకా మెరుగైన సేవలు అందించేలా సలహా కమిటీలు పని చేస్తాయి. కలెక్టర్ల సదస్సులో పురపాలకశాఖ రూపొందించిన ప్రజంటేషన్‌ ఆసక్తికరంగా ఉంది. మిగతా ప్రభుత్వశాఖల కార్యదర్శులు కూడా దీన్ని పరిశీలించాలి’ అని చంద్రబాబు అన్నారు.